కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ అరెస్ట్ కి 'గట్టి రుజువులు చూపండి'

కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ అరెస్ట్ కి 'గట్టి రుజువులు చూపండి'

శారదా చిట్ ఫండ్ కేసు దర్యాప్తులో కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సహకరించడం లేదని సీబీఐ సుప్రీంకోర్టులో ఆరోపించింది. సీబీఐ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాజీవ్ కుమార్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలని కోరారు. అయితే గట్టి సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ కి అనుమతించబోమని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. కేసు విచారణ రేపు జరగనుంది. 

విచారణ సందర్భంగా కోల్ కతా మాజీ సీపీ దర్యాప్తునకు సహకరించడం లేదని సొలిసిటర్ జనరల్ ఆరోపించారు. దర్యాప్తు బృందానికి కుమార్ వివరంగా సమాధానాలు చెప్పడం లేదని తెలిపారు. ఏం అడిగినా నేను డిపార్ట్ మెంట్ లో ఉన్నతాధికారిని..ఈ సంగతి మీకు నా సిబ్బంది చెప్పారో లేదో అంటున్నారని చెప్పారు. ఆయన పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని తుషార్ మెహతా వివరించారు. అయితే సుప్రీంకోర్ట్ మాత్రం వ్యతిరేకంగా గట్టి సాక్ష్యాధారాలు లేకుండా అనుమతినిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సీబీఐ దగ్గరున్న సాక్ష్యాలతో కోర్టు సంతృప్తి చెందాల్సిందేనని చెప్పింది.

రాజీవ్ కుమార్ అరెస్ట్ కోసం వాదిస్తూ తుషార్ మెహతా దర్యాప్తు బృందంపై జరిగిన దాడిని ప్రస్తావించారు. సోదాల కోసం వెళ్లిన సీబీఐ బృందంపై పోలీస్ కమిషనర్ ఇంటి దగ్గర దాడి జరిగింది. అక్కడ ధర్నా కూడా చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధర్నా చేయడాన్ని గుర్తు చేశారు.

దీనిపై స్పందిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, మీ దగ్గర సోదాలకు అనుమతి ఉందా? అని ప్రశ్నించారు. దీనికి సీబీఐ లేదని జవాబిచ్చింది. అయితే అనుమానం ఆధారంగా మేం కేవలం ప్రశ్నించేందుకే వెళ్లామని తెలిపింది. సీబీఐ జవాబుకు 'ఆయన ఇంట్లో కొన్ని సాక్ష్యాలు దొరకవచ్చని మీకు అనుమానం ఉంటే సెర్చ్ వారంట్ ఎందుకు తీసుకోలేదని' చీఫ్ జస్టిస్ అడిగారు.