కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ కు ఊరటనివ్వని సుప్రీంకోర్ట్

కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ కు ఊరటనివ్వని సుప్రీంకోర్ట్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇష్టుడైన పోలీస్ అధికారి రాజీవ్ కుమార్ కష్టాలు పెరిగిపోయాయి. శారద చిట్ ఫండ్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్ట్, కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ పిటిషన్ ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. పశ్చిమ బెంగాల్ లోని సంబంధిత జుడిషియల్ కోర్ట్ తన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోనంత వరకు సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆపాలని రాజీవ్ కుమార్ తన పిటిషన్ లో కోరారు. దీనిపై స్పందిస్తూ సుప్రీంకోర్ట్, అక్కడ చర్యలు కొనసాగుతున్నందువల్ల మీరు కలకత్తా హైకోర్ట్ లేదా ట్రయల్ కోర్టుకి వెళ్లాలని రాజీవ్ కుమార్ కు సూచించింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ కోర్టులకు ఎలాంటి సెలవులు కూడా లేవని.. అందువల్ల తగిన మార్గాన్ని అక్కడ వెతుక్కోవాలని చెప్పింది.

శారదా కుంభకోణంలో అరెస్ట్ నుంచి రక్షణ సమయాన్ని పెంచాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీనియర్ ఐపీఎస్ అధికారి, కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్ట్ తిరస్కరించింది. రాజీవ్ కుమార్ అరెస్టు మినహాయింపు గడుపు మే 24తో ముగుస్తోంది. పశ్చిమ బెంగాల్ లో న్యాయవాదుల సమ్మె జరుగుతోందని చెబుతూ అరెస్ట్ నుంచి మినహాయింపు గడువు పెంచాలని రాజీవ్ కుమార్ కోరారు. కేసు విచారణకు ముగ్గురు జడ్జిల ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలని రాజీవ్ కుమార్ కోరారు. ఇందుకు కోర్టు నిరాకరించింది. సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారన్న కేసులో సీబీఐ రాజీవ్ కుమార్ ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాలని భావిస్తోంది.