కోల్ కతా మాజీ కమిషనర్ పై సీబీఐ తీవ్ర ఆరోపణలు:సుప్రీం

కోల్ కతా మాజీ కమిషనర్ పై సీబీఐ తీవ్ర ఆరోపణలు:సుప్రీం

శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ని ఇటీవలే సీబీఐ ప్రశ్నించిన వ్యవహారంలో పురోగతి నివేదికపై సుప్రీంకోర్ట్ మంగళవారం 'చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిందని' చెప్పింది. కొన్ని చాలా తీవ్రమైన సాక్ష్యాధారాలను తమకు సమర్పిస్తే తాము వాటిని కళ్లు మూసుకొని కూర్చోలేమని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజీవ్ కుమార్ పై తగిన చర్యలు చేపట్టడానికి అభ్యర్థన దాఖలు చేయాల్సిందిగా దర్యాప్తు సంస్థను బెంచ్ ఆదేశించింది. ఈ వ్యవహారంలో అభ్యర్థన దాఖలు చేసేందుకు సీబీఐకి ధర్మాసనం 10 రోజుల సమయం ఇచ్చింది. రాజీవ్ కుమార్, ఇతరులు ఆ తర్వాత ఏడు రోజులలోగా తమ జవాబు దాఖలు చేయవచ్చని సూచించింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ స్కామ్ ను ముందుగా దర్యాప్తు చేసిన సిట్ కు రాజీవ్ కుమార్ చీఫ్ గా వ్యవహరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ తమకు సీల్డ్ కవర్ లో రిపోర్ట్ సమర్పించినందువల్ల తాము రెండో పక్షం వాదనలు వినకుండా ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. 

శారదా చిట్ ఫండ్ కుంభకోణాన్ని దర్యాప్తులో సహకరించడం లేదని, సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ డీజీపీ, కోల్ కతా అప్పటి పోలీస్ కమిషనర్ సహా పలువురు సీనియర్ అధికారులపై సీబీఐ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది.