అన్నాడీఎంకే కీలకపోస్టుపై శశికళ కన్ను.. కోర్టులో పిటిషన్

అన్నాడీఎంకే కీలకపోస్టుపై శశికళ కన్ను.. కోర్టులో పిటిషన్

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి... దివంగత సీఎం జయలలిత ఉన్న సమయంలో.. తెరవెనుక ఉండి చక్రం తిప్పిన శశికళ.. జయ మరణం తర్వాత సీన్‌లోకి వచ్చారు. పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు.. ఊహించని పరిణామాలతో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత పార్టీలో కొన్ని విభేదాలు వచ్చినా.. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు జైలు నుంచి విడుదలైన చిన్నమ్మ (శశికళ) మళ్లీ చక్రం తిప్పాలని భావిస్తున్నారు.. మొదటగా.. అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకు వ్యతిరేకంగా చెన్నై కోర్టులో  పిటిషన్‌ దాఖలు చేశారు శశికళ.. తనకే అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ పదవి అర్హతలు ఉన్నాయంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

దీంతో.. తమిళ రాజకీయాలు ఉత్కంఠగా మారిపోయాయి. కాగా, శశికళకు శిక్ష పడిన తర్వాత అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పదవి నుంచి ఆమెను తొలగించారు. ఆ తర్వాత పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించారు. అయితే, అన్నాడీఎంకేను వదిలేది లేదన్నట్టుగా ఆమె జైలు నుంచి విడుదలైన రోజే సంకేతాలిచ్చారు.. కారులో జయలలిత ఫొటోతో పాటు.. కారు ముందు భాగంలో అన్నాడీఎంకే జెండాతో తమిళనాడులోకి అడుగుపెట్టారు. ఇక, ఆమెకు ఘనస్వాగతమే లభించింది.. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత పావులు కదుపుతోన్న ఆమె.. ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. మరి న్యాయపోరాటంలో ఎవరు గెలుస్తారు..? చిన్నమ్మ తిరిగి చక్రం తిప్పుతారా? అనేది ఉత్కంఠగా మారిపోయింది.