జైలు నుంచి విడుదల కానున్న శశికళ.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ?

జైలు నుంచి విడుదల కానున్న శశికళ.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ?

జయలలిత స్నేహితురాలు శశికళ త్వరలో జైలు నుంచి విడుదల కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు ఆమె న్యాయవాది. కోర్టు విధించిన పది కోట్ల రూపాయల జరిమానా చెల్లించడానికి కూడా రంగం సిద్ధమైంది. అంతేకాదు... ఎన్నికల్లో పోటీ చేయడానికి సైతం వ్యూహరచన చేస్తున్నారు. న్యాయమైన ఇబ్బందులు ఎదురుకాకుండా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు ఆమె న్యాయవాది. అక్రమాస్తుల కేసులో కర్ణాటక పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు శశికళ. వాస్తవానికి 2021 జనవరితో ఆమె శిక్షా కాలం ముగుస్తుంది. అయితే, ఇప్పటికే 43 నెలల జైలు శిక్ష పూర్తి చేశారు. సత్ప్రవర్తన కారణంగా ఆమె శిక్షా కాలం 129 రోజులు తగ్గుతుందని చెబుతున్నారు ఆమె న్యాయవాది రాజాచెందూర్‌ పాండియన్‌. ఈ క్రమంలో మరో పది రోజుల్లో శిశకళ జైలు నుంచి విడుదల కావడం ఖాయమని చెబుతున్నారు. రెండు, మూడు రోజుల్లోనే దీనిపై స్పష్టత వస్తుందంటున్నారు శశికళ న్యాయవాది.  

అక్రమాస్తుల కేసులో శశికళకు 10 కోట్ల 10 వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు. దీంతో ఈ మొత్తాన్ని చెల్లించడానికి కూడా రంగం సిద్ధమైంది. జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని తన న్యాయవాది రాజాచెందూర్‌ పాండియన్‌కు ఇటీవల శశికళ లేఖరాశారు. కరోనా నిబంధనల కారణంగా ఖైదీలతో ములాఖత్‌లకు పరప్పన అగ్రహారం జైలు అధికారులు అనుమతివ్వడం లేదు. దీంతో అన్నా డీఎంకే పార్టీ నేతలతో పాటు న్యాయవాదులకు శశికళను కలిసే అవకావం లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో జరిమానా చెల్లింపునకు సంబంధించి న్యాయవాదికి శశికళ లేఖ రాశారు. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శశికళ వ్యూహ రచన చేస్తున్నారు. 

దీనిలో భాగంగా న్యాయనిపుణులతో చర్చించిన శశికళ... సుప్రీం కోర్టులో కేవియేట్‌ పిటిషన్‌ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నాలుగేళ్లు జైలు శిక్ష పడడం వల్ల శశికళకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. దీంతో తనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా కేవియేట్‌ పిటిషన్‌ దాఖలు చేసి... ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసుకోవాలన్నది శశికళ వ్యూహం. కాగా, సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖల చేయడం దగ్గర నుంచి ఇతర న్యాయపరమైన వ్యవహారాలపై ఢిల్లీలోని సీనియర్‌ న్యాయవాదుల్ని సంప్రదించాలని ఇటీవల రాసిన లేఖలో న్యాయవాది రాజాచెందూర్‌ పాండియన్‌కు సూచించారు శశికళ.  అన్నా డీఎంకే నేత దినకరన్‌తో కలిసి ఈ వ్యవహారాలను చూడాల్సిందిగా కోరారు. మొత్తానికి జైలు నుంచి విడుదలయ్యాక తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు శశికళ.  అన్నా డీఎంకే పార్టీపై తనకున్న పట్టేంటో నిరూపించుకోవడంతో పాటు ఎన్నికల్లో గెలిచి సత్తా ఏంటో చూపాలని పట్టుదలగా ఉన్నారు.