మక్కావైపు వెళ్తున్న క్షిపణల కూల్చివేత

మక్కావైపు వెళ్తున్న క్షిపణల కూల్చివేత

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల పవిత్ర నగరం మక్కాపైకి దూసుకెళ్తున్న బాలిస్టిక్ క్షిపణిని సౌదీ అరేబియా వైమానిక బలగాలు మధ్యలోనే అడ్డుకొని కూల్చేశాయి. దీంతో పాటు జెడ్డా నగరం లక్ష్యంగా వెళ్తున్న మరో బాలిస్టిక్ మిస్సైల్ ని కూడా ధ్వంసం చేసినట్టు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ అల్ అరేబియా తెలిపింది. ఈ ఆయుధాలను యెమెన్ కు చెందిన హౌథీ ఉగ్రవాదులు ప్రయోగించారు. ఈ రెండు బాలిస్టిక్ క్షిపణులను తయీఫ్ దగ్గర రాజ్య వైమానిక రక్షణ బలగాలు నేలకూల్చినట్టు తెలిసింది.

పవిత్ర నగరం మక్కాను లక్ష్యంగా చేసుకోవడాన్ని యెమెన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పవిత్ర స్థలంపై దాడికి ప్రయత్నించడం 'పూర్తి స్థాయిలో ఉగ్రవాద చర్య'గా అభివర్ణించింది. యెమెన్ అధ్యక్షుడు అబ్ద్-రబ్బూ మన్సూర్ హాదికి మద్దతుగా హౌథీ ఉగ్రవాదులతో జరుగుతున్న అంతర్యుద్ధంలోకి 2015లో సౌదీ అరేబియా ప్రవేశించినప్పటి నుంచి వందలాది మిస్సైల్ దాడులు జరిగాయి. హౌథీ ఉగ్రవాదులు సౌదీ సరిహద్దు పట్టణాలు, రియాద్ లను లక్ష్యంగా చేసుకొని బాలిస్టిక్ మిస్సైల్ దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 112 మంది సౌదీ పైరులు మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. గతంలో అబూ దాబీ, దుబాయ్ విమానాశ్రయాలపై డ్రోన్ దాడులు కూడా చేశారు.