సౌదీ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం

సౌదీ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం

రష్యాలో ఫిఫా ప్రపంచకప్‌ పోటీలలో పాల్గొంటున్న సౌదీ అరేబియా ఆటగాళ్లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రష్యాలోని వేర్వేరు నగరాల్లో ఉన్న వేదికలలో ఫిఫా-2018 ప్రపంచకప్‌ పోటీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫిఫా ప్రపంచకప్‌ పోటీలలో పాల్గొనే ఆయా దేశాలు వేర్వేరు నగరాలకు విమానాలలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రూప్-ఏ లో ఉన్న సౌదీ అరేబియా జట్టు ఆటగాళ్లు బుధవారం ఉరుగ్వేతో మ్యాచ్‌ కోసం సోమవారం అర్ధరాత్రి విమానంలో మాస్కో నుండి రోస్తావ్‌-ఆన్‌-డాన్ చేరుకున్నారు. రోస్తావ్‌ ఎయిర్‌పోర్టులో సౌదీ అరేబియా ఆటగాళ్లు విమానం దిగుతున్న సమయంలో విమాన ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఇది గమనించిన ఆటగాళ్లు తొందరగా విమానం దిగిపోయారు. వెంటనే అధికారులు అప్రమత్తమై మంటలను ఆర్పేశారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆటగాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వారు క్షేమంగా హోటల్‌కు చేరుకున్నారు. రోస్తావ్‌ ఆన్‌ డాన్ విమానాశ్రయంలో ఆటగాళ్లు ప్రయాణించిన విమానం.. ల్యాండ్‌ అయ్యే సమయంలో ఒక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని ఎయిర్‌లైన్స్‌ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరిగిన ఘటనపై విచారణ చేపడతామన్నారు.