మ్యాడీకి `స‌వ్య‌సాచి` ప్రేమ‌లేఖ‌

మ్యాడీకి `స‌వ్య‌సాచి` ప్రేమ‌లేఖ‌
మ్యాడీ అలియాస్ ఆర్‌.మాధ‌వ‌న్ .. అంత‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ఇది. వీజే ట‌ర్న్‌డ్‌ హీరోగా అత‌డు ప్ర‌పంచానికి సుప‌రిచితం. 17ఏళ్లుగా సినీ హీరోగా వెలుగులు ప్ర‌స‌రిస్తున్న మ్యాడీకి అటు త‌మిళం, హిందీ స‌హా ఇటు తెలుగులోనూ వీరాభిమానులున్నారు. `స‌ఖి` లాంటి క్లాసిక్ సినిమాతో తెలుగులోనూ గొప్ప అభిమానుల్ని సంపాదించిన మ్యాడీ, ఆ త‌ర‌వాత `చెలి` సినిమాతో ఫ్యాన్ బేస్‌ను సుస్థిరం చేసుకున్నారు. అవ‌న్నీ తమిళ్ నుంచి తెలుగు అనువాదాలుగా వ‌చ్చినా, తెలుగు సినిమాలుగానే జ‌నం ఆద‌రించారు. ఒక్క‌సారి మ్యాడీని ఆ రెండు సినిమాల్లో చూసిన ఏ కాలేజ్ విద్యార్థి అయినా అత‌డిని ప్రేమించి, అభిమానించ‌కుండా ఉండ‌లేడు. ఈ ద‌శాబ్ధంలో అత‌డు ది బెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌లో న‌టించాడు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌- చందు మొండేటి కాంబినేష‌న్ సినిమా `స‌వ్య‌సాచి`లో ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టిస్తున్నారు మాధ‌వ‌న్‌. అందుకే అత‌డికి చందు మొండేటి & టీమ్ ఓ ప్రేమ‌లేఖ‌ను రాశారు. మ్యాడీపై చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన సంద‌ర్భంగా చందు టీమ్ ఎంతో ఎమోష‌న‌ల్‌గా రాసిన ఈ లేఖ హృద‌యాల్ని హ‌త్తుకుంది. ``ప్రియ‌మైన మ్యాడీ స‌ర్‌.. ఇప్ప‌టికే మీతో ల‌వ్‌లో ప‌డి 17ఏళ్లు పూర్త‌యింది. మీ గ్రాఫ్ వీజే నుంచి జాతీయ ఆర్టిస్టు వ‌ర‌కూ ఎదిగిన తీరు అన‌న్య సామాన్యం. అది చూసి ఎంతో స్ఫూర్తి పొందాం. అదొక్క‌టే కాదు.. మీరు ప‌బ్లిక్‌లో మాట్లాడే నైపుణ్యం అన్నా మాకు ఎంతో ఇష్టం. ద‌ర్శ‌కుడి విజ‌న్‌ని అర్థం చేసుకుని న‌టించే గొప్ప న‌టుడితో క‌లిసి ప‌ని చేసినందుకు గ‌ర్వంగా ఉంది. మీపై ఉన్న గౌర‌వంతోనే ఏ ప్రాజెక్టుకు అయినా గుర్తింపు వ‌స్తుంది. మీ న‌ట‌న తెర‌పై చూడ‌డం ఆహ్ల‌దంగా ఉంటుంది. దానిని మించి సెట్స్‌పై మీ పెర్‌ఫామెన్స్ చూడ‌డాన్ని గొప్ప‌గా ఫీల‌య్యాం. మా టీమ్ అంతా మీకు ఫ్యాన్స్ అయిపోయాం. మీరు తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం కావ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్టింది. మీరు ఓకే అనడంతోనే మా సినిమా స‌గం స‌క్సెసైంది. వెల్‌కం.. హృద‌య‌పూర్వ‌కంగా..`` అని లేఖ‌లో రాశారు.