ఎస్బీఐ కనీస బ్యాలెన్స్ నియమాలు, పెనాల్టీ చార్జీలివే

ఎస్బీఐ కనీస బ్యాలెన్స్ నియమాలు, పెనాల్టీ చార్జీలివే

ఎక్కువ శాతం బ్యాంకుల్లో వినియోగదారులు తమ పొదుపు ఖాతాల్లో నెలవారీ సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) ఉంచడం తప్పనిసరి. ఎవరైనా వినియోగదారుడు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోతే కొంత మొత్తాన్ని జరిమానాగా బ్యాంకులు వసూలు చేస్తాయి. దేశంలోనే అతిపెద్దదైన ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో కనీస బ్యాలెన్స్ నియమాలు, జరిమానా మొత్తం గురించి ఇప్పుడు చూద్దాం.

ఎస్బీఐ కస్టమర్లు తమ సేవింగ్స్ ఖాతాల్లో కనీస మొత్తం ఉంచడం అనివార్యం. బ్యాంకు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్బీడీ)లకు ఈ నియమం వర్తించదు. ఎస్బీఐలో మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరి అనేది శాఖలపై ఆధారపడి వేర్వేరుగా ఉంటుంది. ఎస్బీఐ శాఖలను మెట్రో, గ్రామీణ, అర్బన్, సెమీ అర్బన్ శాఖలుగా విభజించారు.

మెట్రో, అర్బన్ శాఖలలో వినియోగదారులు తమ ఖాతాలో రూ.3000 యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ (ఏఎంబీ సగటు నెలవారీ మొత్తం) ఉంచడం తప్పనిసరి. సెమీ అర్బన్ శాఖలైతే రూ.2000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 కనీస మొత్తంగా నిర్ణయించారు. 

మెట్రో, అర్బన్ శాఖల వినియోగదారుల ఖాతాల్లో రూ.1500 లేదా అంత కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంచేవారిపై నెలకు రూ.10 జరిమానా, జీఎస్టీ విధిస్తారు. ఒకవేళ వారి బ్యాలెన్స్ నిర్ధారిత పరిధి కంటే 50-75 శాతం తక్కువగా ఉంటే వారు రూ.12, జీఎస్టీని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. అదే బ్యాలెన్స్ రూ.3000లలో 75 శాతం తక్కువగా ఉంటే పెనాల్టీ మొత్తం రూ.15, దాంతో పాటు జీఎస్టీ కూడా ఇవ్వాల్సి వస్తుంది.

సెమీ అర్బన్ శాఖలలో 50% కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే నెలకు రూ.7.50, జీఎస్టీ పడుతుంది. అదే 50-75% తక్కువగా ప్రతి నెల రూ.10, జీఎస్టీ విధిస్తారు. 75% కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంచితే రూ.12, జీఎస్టీ బాదుడు ఉంటుంది.

గ్రామీణ శాఖలో నెలవారీ సగటు బ్యాలెన్స్ 50% కంటే తక్కువగా ఉంటే ప్రతి నెల రూ.5, జీఎస్టీ విధిస్తారు. 50-75% లోపు తక్కువైతే రూ.7.50, జీఎస్టీ తప్పదు. బ్యాలెన్స్ 75% కంటే తక్కువకి పడిపోతే రూ.10, జీఎస్టీ చెల్లించక తప్పదు.