ఎస్‌బీఐ: పనితీరు పర్లేదు

ఎస్‌బీఐ: పనితీరు పర్లేదు

మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో  భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) పనితీరు  మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది.  2018-19 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం  రూ.838.40 కోట్ల నికర లాభం ఆర్జించింది.  వసూలు కాని అప్పులు  (నిరర్థక ఆస్తులు -ఎన్పీఏ) తగ్గడం లాభాలు ఆర్జించడానికి దోహదపడిందని  బ్యాంక్ పేర్కొంది.  గత ఆర్థిక సంవత్సరం అంటే 2017-18లో చివరి  త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ. 7,718.17 కోట్ల నికర నష్టం ప్రకటించింది.

ఈ సారి బ్యాంక్‌ ఆదాయం సుమారు 11 శాతం పెరిగి రూ.75,670.50 కోట్లకు చేరింది.  ఏడాది క్రితం ఇదే కాలంలో ఆదాయం రూ. 68,436.06 కోట్లు.   2017-18లో పూర్తి ఏడాదికి ఎస్‌బీఐ నికర నష్టం  రూ.4,187.41 కోట్లు కాగా... అన్ని కంపెనీల ఏకీకృత ఆదాయం రూ.3.30 లక్షల కోట్లు.  2017-18లో ఇది రూ.3.01 లక్షల కోట్లు.  బ్యాంక్‌ ఎన్‌పీఏలు  తగ్గి స్థూల రుణాల్లో  7.53 శాతంగా ఉన్నట్లు బ్యాంక్‌ తెలిపింది. గత ఏడాది మార్చి నెలాఖరుకు  స్థూల ఎన్పీఏలు 10.91 శాతంగా ఉండేవి. ఇదే కాలంలో నికర ఎన్‌పీఏలు 3.95 శాతం నుంచి తగ్గి 3.01 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ పేర్కొంది. ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో బ్యాంక్‌ ఆర్థిక ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు  బ్యాంక్‌  తెలిపింది.