ఎస్‌బీఐ సర్వీస్‌ ఛార్జీలపై పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..

ఎస్‌బీఐ సర్వీస్‌ ఛార్జీలపై పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..

సోషల్ మీడియా పుణ్యమా అని ఏది వైరల్‌ వార్తో.. ఏది రియల్ వార్తో తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. చిన్న పుకార్ల నుంచి.. కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసి పుకార్లు కూడా సోషల్ మీడియాలో షికార్లు చేస్తూ.. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సర్వీస్ ఛార్జీలపై రకరకాల న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఇవాళ్టి నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు అమల్లోకి వచ్చిన మాట వాస్తమే.. కానీ, దానిని అడ్డుపెట్టుకొని.. క్యాష్ డిపాజిట్స్, విత్‌డ్రాయల్స్, ఏటీఎం లావాదేవీల లిమిట్.. ఛార్జీలపై జోరుగా ప్రచారం జరిగింది. వీటికి సోషల్ మీడియా వేదికగానే పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది ఎస్‌బీఐ.. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని క్లారిటీ ఇస్తూనే.. కొత్త సర్వీస్ ఛార్జీలు, క్యాష్ డిపాజిట్స్, విత్‌డ్రాయల్స్, ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై స్పష్టత ఇచ్చింది. 

ట్విట్టర్‌లో ఎస్‌బీఐ ప్రకటించిన ప్రకారం.. క్యాష్ డిపాజిట్లు నెలకు 3, ఏడాదికి 36 ఉచితంగా పేర్కొంది. ఇక, క్యాష్ విత్‌డ్రాయల్స్‌పై కూడా క్లారిటీ ఇచ్చింది.. ఇవి నెలకు 2, ఏడాదికి 24 ట్రాన్సాక్షన్స్ ఉచితంగా అందించనుంది. మరోవైపు ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎంలో లావాదేవీలపై స్పందిస్తూ నెలకు 5, ఏడాదికి 60 ట్రాన్సాక్షన్స్ ఉచితంగా తెలిపింది. ఇతర బ్యాంకుల ఏటీఎం లావాదేవీల విషయానికి వస్తే నెలకు మెట్రో నగరాల్లో 3, ఇతర ప్రాంతాల్లో 5, ఏడాదికి మెట్రో నగరాల్లో 36, ఇతర ప్రాంతాల్లో 60 లావాదేవీలు ఉచితంగా ప్రకటించింది. ఇలా మొత్తం ట్రాన్సాక్షన్స్.. నెలకు మెట్రో నగరాల్లో 13, ఇతర ప్రాంతాల్లో 15గా, ఏడాదికి మెట్రో నగరాల్లో 156, ఇతర ప్రాంతాల్లో 180 లావాదేవీలుగా క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారానికి చెక్ పెడుతూనే.. సేవింగ్ ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపై క్లారిటీ ఇచ్చింది ఎస్‌బీఐ.