రూ.3,622 కోట్ల ఎన్నికల బాండ్లు అమ్మిన ఎస్బీఐ!!

రూ.3,622 కోట్ల ఎన్నికల బాండ్లు అమ్మిన ఎస్బీఐ!!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి, ఏప్రిల్ నెలల్లో రూ.3,622 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను అమ్మింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన అర్జీకి జవాబుగా ఈ వివరాలు తెలియజేసింది. మార్చిలో రూ.1,365.6 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ జారీ చేసింది. ఏప్రిల్ లో రూ.2,256.3 కోట్ల విలువైన బాండ్లను అమ్మింది. ద లీఫ్ లెట్ ప్రకారం పూణెకి చెందిన విహార్ దుర్వే ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బ్యాంకు మే 4న ఈ విధంగా సమాధానం ఇచ్చింది.

జనవరి 2018లో ద్రవ్య సాధనాలుగా ఎలక్టోరల్ బాండ్స్ ను ప్రవేశపెట్టడం జరిగింది. వీటిని ఎస్బీఐ నుంచి ప్రజలు, కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేసి ఏదైనా రాజకీయ పార్టీకి ఇవ్వవచ్చు. ఆ తర్వాత వాటిని వాళ్లు డబ్బుగా మార్చుకోవచ్చు. ఈ బాండ్లు అనామకంగా ఉంటాయి. ఆర్టీఐ సమాధానం ప్రకారం ఏప్రిల్ లో చాలా వరకు ఎలక్టోరల్ బాండ్స్ ని ముంబైలో అమ్మారు. మహారాష్ట్ర రాజధానిలో రూ.694 కోట్ల బాండ్లు జారీ చేశారు. కోల్ కతాలో రూ.417 కోట్లు, న్యూఢిల్లీలో రూ.408 కోట్లు, హైదరాబాద్ లో రూ.338 కోట్లు అమ్మడం జరిగింది.

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన అర్జీపై ఏప్రిల్ లో సుప్రీంకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దేశ ఎన్నికల ప్రక్రియపై ఈ కేసు తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతూ ఈ వ్యవహారాన్ని తర్వాత పరిశీలించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు తమకు అందిన బాండ్ల వివరాలను పేర్కొంటూ మే 30లోగా ఎన్నికల సంఘానికి సీల్డ్ కవర్ అందజేయాలని రాజకీయ పార్టీలకు చెప్పింది. ఏప్రిల్, మే లలో ఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవధిని 10 రోజుల నుంచి 5 రోజులకి తగ్గించాల్సిందిగా ఆర్థిక మంత్రిత్వశాఖను ఆదేశించింది.