రైతుల ట్రాక్టర్ల ర్యాలీపై సుప్రీంకోర్టు విచారణ..

రైతుల ట్రాక్టర్ల ర్యాలీపై సుప్రీంకోర్టు విచారణ..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీ శివారులో రైతుల ఆందోళన సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది... ఇప్పటికే తొమ్మిది దశలుగా కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ఇక, సమస్యల పరిష్కారానికి ఓ కమిటీని ప్రకటించింది సుప్రీంకోర్టు.. అది ఎలా ఉన్నా.. రైతులు రోజుకో తరహాలో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. వారి ఆందోళనలో భాగంగా.. 26వ తేదీన రిపబ్లిక్‌ డే సందర్భంగా.. ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. రిపబ్లిక్ డేన రైతులు నిర్వహించతలబెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై ఇన్‌జంక్షన్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు వేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగగా... కేంద్రం తరఫున కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు.. రైతుల ర్యాలీ చట్టవిరుద్ధమవుతుంది.. ఢిల్లీలోకి 5000 మంది ప్రజలు అడుగుపెట్టే అవకాశం ఉందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. ఢిల్లీలోకి ప్రవేశమనేది శాంతి భద్రతల పరిస్థితే అయితే.. దానిని నిర్ధారించుకోవాల్సింది పోలీసులేనని వ్యాఖ్యానించింది.. ఢిల్లీ పోలీసులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.. గణతంత్ర దినోత్సవం దృష్ట్యా పోలీసుల అభిప్రాయం తీసుకుంటామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.