మోడీ, షాల ఉల్లంఘనలపై సుప్రీంలో రేపు విచారణ

మోడీ, షాల ఉల్లంఘనలపై సుప్రీంలో రేపు విచారణ

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్నికల సంఘం సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్ట్ మంగళవారం విచారణకు చేపట్టనుంది. ఈ పిటిషన్ ను సిల్చార్ ఎంపీ, ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్ దాఖలు చేశారు.

సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి అర్జంట్ లిస్టింగ్ కింద దాఖలు చేసిన ఈ పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఎన్నికల సంఘానికి అనేక పిటిషన్లు దాఖలు చేసినట్టు సింఘ్వీ తెలిపారు. ఇప్పటికైనా ఈ ఉల్లంఘనలపై అందజేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.

ఈ పిటిషన్ ఎవరికి వ్యతిరేకంగా దాఖలు చేశారో ఆ వ్యక్తుల పేర్లను ప్రకటించాల్సిందిగా సీజేఐ కోరారు. 'ప్రధాని మోడీనా? అమిత్ షానా? మీరు వాళ్ల పేర్లెందుకు చెప్పడం లేదు?' అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ కేసును చివరికి వింటానని, తన ముందున్న మిగతా కేసుల విచారణ పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిందిగా సింఘ్వీకి సూచించారు. చివరకు  కేసు విచారణకు రాగా ఆసాంతం రేపు విచారణ జరుపుతామని సీజేఐ తెలిపారు. 

ఈ పిటిసన్ లో అనేక అంశాలతో పాటుగా ఎన్నికల ప్రచారంలో సాయుధ దళాలపై ప్రధాని వ్యాఖ్యలు, విద్వేష ప్రసంగ ఆరోపణలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఎన్నికల సంఘానికి ఇలాంటి 40 ఫిర్యాదులు చేసినట్టు కాంగ్రెస్ తన పిటిసన్ లో పేర్కొంది. అయితే తమ ఫిర్యాదులపై ఈసీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఎన్నికల రోజున ప్రధానమంత్రి ర్యాలీ నిర్వహించడం కూడా ఈ ఫిర్యాదుల్లో ఉంది. 

ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందరికీ ఒకే విధమైన న్యాయం అమలయ్యే విధంగా చూడాల్సిన తన రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించేందుకు విముఖత చూపుతోందని పిటిషన్ లో తెలిపారు. ప్రధాని, షాలకు ఉల్లంఘనలు అలవాటుగా మారాయని, ఈసీ తన బాధ్యతల నుంచి పారిపోరాదని న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.