సీజేఐ లైంగిక వేధింపుల కేసు: మూలాల వరకు వెళతామన్న సుప్రీంకోర్ట్

సీజేఐ లైంగిక వేధింపుల కేసు: మూలాల వరకు వెళతామన్న సుప్రీంకోర్ట్

సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్ట్ విచారణ ముగిసింది. కోర్టులో న్యాయవాది ఉత్సవ్ బైయిన్స్ సీల్డ్ కవర్ లో సీసీటీవీ ఫుటేజీ అందజేశారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలని ఉత్సవ్ బైయిన్స్ డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ గురువారం జరుగుతుంది. ఈ కేసులో ఉత్సవ్ బైయిన్స్ రేపు అంటే గురువారం ఉదయం 10.30 గంటలలోపు అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తన పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితులు కల్పించేలా ఆయనపై లైంగిక వేధింపుల కట్టుకథ అల్లే కేసు తనకు మంచి ఆఫర్ తో వచ్చినట్టు ఉత్సవ్ బైయిన్స్ చెబుతున్నారు.

తన అఫిడవిట్ లో ఉత్సవ్ బైయిన్స్ కొన్ని పేర్లను పేర్కొన్నట్టు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాల బెంచ్ తెలిపింది. ఇది ఒక యువకుడు చేసిన తీవ్ర ఆరోపణ అని, తను తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తే తన పూర్తి కెరీర్ పై దుష్పరిణామాలు ఉంటాయని తెలిసీ ఇందుకు అతను సిద్ధపడ్డాడని అభిప్రాయపడింది. వ్యవస్థను ప్రక్షాళన చేసే బాధ్యత తమపై ఉందని చెప్పింది. బుధవారం విచారణ పూర్తయ్యాక స్పెషల్ బెంచ్ ఇది సీజేఐ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే కుట్రకు సంబంధించిన వ్యవహారం కనుక ఉత్సవ్ బైయిన్స్ ఇచ్చిన సమాచారం సీల్డ్ కవర్ లో ఉంచాలని, దాని గోపనీయతను పరిరక్షించాలని సూచించింది. దీనికి సంబంధించి బైయిన్స్ కొన్ని ప్రదేశాల్లో కొందరు కీలక వ్యక్తులను కలిసినట్టు చెబుతున్నారు. అందువల్ల ఈ అఫిడవిట్ ను సీబీఐ డైరెక్టర్, ఐబీ చీఫ్, పోలీస్ కమిషనర్ లకు అందజేసి ఈ వ్యవహారంలో సాయపడాల్సిందిగా కోరినట్టు కోర్టు పేర్కొంది.

'అజయ్ అనే వ్యక్తి తనను కలిసినట్టు ఉత్సవ్ బైయిన్స్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన మహిళ, కొందరు ఇతర రిజిస్ట్రీ ఉద్యోగులతో పాటు తపన్ చక్రవర్తి, మానవ్ శర్మ కలిసి కుట్ర పన్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది తీవ్రమైన విషయం. న్యాయవ్యవస్థలో ఫిక్సింగ్ ఉండరాదు. మేం ఈ వ్యవహారం మూలాల వరకు వెళ్లాలనుకుంటున్నాం. ఈ ఫిక్సర్ ఎవరు? మీకు ప్రతి ఒక్కరిని రక్షించే అధికారం ఉంది. స్వతంత్రంగా ఉండండి. నిజాలను నిగ్గు తేల్చండి. సుప్రీంకోర్టులో ఏదైనా ఫిక్సింగ్ సర్కిల్ ఉందా లేదా? మేం మా కళ్లను మూసుకోవాలా? ఇలాంటి అఫిడవిట్ ను ఉపేక్షిస్తే దేశ న్యాయవ్యవస్థ విశ్వాసం కోల్పోతుందని' జస్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు.

బెంచ్ తన ఛాంబర్ కు సీబీఐ డైరెక్టర్, పోలీస్ కమిషనర్, ఐబీ చీఫ్ లను పిలిపించింది. ముగ్గురు ఆఫీసర్లు కోర్టులో జడ్జిలతో దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. న్యాయవాది బైయిన్స్ భద్రతపై ధర్మాసనం ఈ ముగ్గురు అధికారులతో చర్చించినట్టు తెలిసింది. అంతకు ముందు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నారీమన్, జస్టిస్ దీపక్ గుప్తాల బెంచ్ ఉత్సవ్ బైయిన్స్ అఫిడవిట్ ప్రతులను వారికి అందజేసింది. సీల్డ్ కవర్ లోని సాక్ష్యాధారాలను కోర్టుకు అప్పజెప్పింది. బైయిన్స్ అఫిడవిట్, ఇతర అనుబంధ రుజువులపై బెంచ్ సలహా సంప్రదింపులు జరుపుతోంది. 

కొందరు ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేయొద్దని తనపై ఒత్తిడి తెచ్చినట్టు ఉత్సవ్ బైయిన్స్ చెప్పారు. శుక్రవారం తాను దీనిని బట్టబయలు చేశానని తెలిపారు. బార్ వర్గాలుగా విడిపోయినట్టు బార్ నుంచి తనకు సూచన వచ్చిందని, ఇది ఎంతో దురదృష్టకరమని బైయిన్స్ విచారం వ్యక్తం చేశారు. ఈ కుట్రను పూర్తిగా బట్టబయలు చేసేందుకు తాను మరో అఫిడవిట్ దాఖలు చేయాలనుకుంటున్నట్టు బైయిన్స్ చెప్పారు. పోలీసుల దగ్గరకు వెళ్తే ప్రయోజనం లేదని.. పోలీసులు రాష్ట్ర పరిధిలో ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల్లో మునిగి తేలుతోందని విమర్శించారు. అందువల్ల దీనిపై న్యాయ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.