రఫెల్ రహస్య పత్రాల ప్రచురణ అడ్డుకొనేందుకు ప్రభుత్వానికే అధికారం లేదు

రఫెల్ రహస్య పత్రాల ప్రచురణ అడ్డుకొనేందుకు ప్రభుత్వానికే అధికారం లేదు

బుధవారం రఫెల్ ఒప్పందం కేసులో కొత్త పత్రాలను రికార్డుగా స్వీకరించడానికి అనుకూలంగా తీర్పునిస్తూ సుప్రీంకోర్ట్ దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతమయ్యేందుకు పత్రికా స్వేచ్ఛ తప్పనిసరని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో మీడియాలో ప్రబలుతున్న పక్షపాత ధోరణి ఆందోళనకరంగా మారుతోందని హెచ్చరించింది. రఫెల్ కేసులో రహస్యంగా చెబుతున్న పత్రాలను ఉపయోగించి ఇంగ్లిష్ వార్తాపత్రిక ద హిందూ వరుస కథనాలు ప్రచురించడంపై ప్రభుత్వ అభ్యంతరాలను ప్రస్తావిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల ధర్మాసనం పత్రికా స్వేచ్ఛపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమంగా సాధించిన పత్రాలు, వార్తా కథనాల ఆధారంగా దాఖలైన 10 రివ్యూ పిటిషన్లను పరిశీలించరాదని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదించారు. దీనిపై బెంచ్ ఇవాళ 'వాక్ స్వాతంత్ర్యానికి రాజ్యాంగం ఇచ్చిన హామీ కింద అలాంటి ప్రచురణ హక్కులను పరిగణించాలని' అభిప్రాయపడింది. ఈ పత్రాల ప్రచురణ 1950 నుంచి పత్రికా స్వేచ్ఛకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు, అభిప్రాయాలను ప్రస్తుత బెంచ్ కు గుర్తు చేశాయని చీఫ్ జస్టిస్, జస్టిస్ ఎస్ కె కౌల్ పేర్కొన్నారు. అలాగే రహస్యంగా పేర్కొన్న పత్రాల ప్రచురణను అడ్డుకొనేందుకు ఎలాంటి న్యాయపరమైన విధివిధానాలు లేవని, అలాంటి పత్రాలను కోర్టుకు సమర్పించకుండా అడ్డుకోజాలవని కోర్టు కీలక వ్యాఖ్య చేసింది.

ప్రస్తుత తీర్పుకి సంబంధించి ప్రత్యేకంగా జస్టిస్ కెఎం జోసెఫ్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అందులో ఆయన కూడా పత్రికా స్వేచ్ఛను బలపరిచారు. భారత్ లో మీడియా దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించిందని అన్నారు. 'దేశంలో ప్రజాస్వామ్య విలువలు కొనసాగేందుకు పత్రికా స్వేచ్ఛ ప్రధాన పాత్ర పోషించాల్సి ఉందని' జస్టిస్ జోసెఫ్ అభిప్రాయపడ్డారు. సమాచార ప్రవాహం ఈ మార్గం ద్వారా ప్రవహిస్తోందని.. ఇది ఎలాంటి ఇతర అంశాలతో కలుషితం కాకుండా కేవలం సత్యాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ జోసెఫ్ అన్నారు. ప్రెస్ నిర్భయంగా, పక్షపాత రహితంగా పనిచేయాలని కోరారు. వ్యక్తిగత, రాజకీయ, ఆర్థిక అంశాల కారణంగా పక్షపాత ధోరణితో సమాచారం ప్రసారం చేస్తే అది నిజమైన స్వాతంత్ర్యానికి వెన్నుపోటుగా భావించాలని అభిప్రాయపడ్డారు. మీడియా తమ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలే తప్ప బాధ్యతలు పట్టించుకోకపోతే అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని తెలిపారు. 'కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల కనిపిస్తున్న పక్షపాత ధోరణి కలవరపరుస్తోంది. వ్యాపార ప్రయోజనాల నియంత్రణ, రాజకీయ సంబంధాల నిర్వహణలు ఆపేక్షరహితంగా, నిష్పక్షపాతంగా సమాచారాన్ని అందించే విధిని దెబ్బతీస్తున్నాయని' జస్టిస్ జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం పత్రికా స్వేచ్ఛకు రక్షణ ఉన్నందువల్ల వాస్తవమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడమనే పవిత్ర విధిని నిర్వర్తించాలని మీడియాను ఆయన కోరారు.