సీజేఐ కేసు దర్యాప్తు నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్ వి రమణ

సీజేఐ కేసు దర్యాప్తు నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్ వి రమణ

సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల దర్యాప్తునకు ఏర్పాటు చేసిన ముగ్గురు న్యాయమూర్తుల అంతర్గత దర్యాప్తు ప్యానెల్ నుంచి జస్టిస్ ఎన్ వి రమణ గురువారం వైదొలిగారు. జస్టిస్ ఎస్ ఏ బోబ్డే అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ నుంచి జస్టిస్ రమణ స్వయంగా తప్పకుంటున్నట్టు తెలిపారని అత్యున్నత న్యాయస్థానం వర్గాలు చెప్పాయి.

చీఫ్ జస్టిస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ ఈ ప్యానెల్ లో జస్టిస్ ఎన్ వి రమణను చేర్చడంపై అభ్యంతరం తెలిపింది. జస్టిస్ రమణ, చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కి సన్నిహిత మిత్రుడని.. తరచుగా ఆయన ఇంటికి వెళ్తుంటారని ఫిర్యాదు చేసిన మహిళ చెప్పింది. 

ఫిర్యాదుదారు శుక్రవారం ఈ కమిటీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. జస్టిస్ బోబ్డేకి పంపిన లేఖలో ఫిర్యాదీ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీలో మహిళ జడ్జి జస్టిస్ ఇందిరా బెనర్జీని చేర్చడాన్ని ప్రశ్నిస్తూ ఇది విశాఖ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. పనిచేసే చోట లైంగిక వేధింపుల ఆరోపణల దర్యాప్తునకు ఏర్పాటు చేసే కమిటీలో మహిళల మెజార్టీ ఉండాలని అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు ఇచ్చిందని గుర్తు చేసింది.