శారదా స్కాం విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జి

శారదా స్కాం విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జి

శారదా చిట్ ఫండ్ స్కాం దర్యాప్తులో పశ్చిమ బెంగాల్ అధికార యంత్రాంగం అడ్డుకుంటోందని ఆరోపిస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు బుధవారం వైదొలిగారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నాల బెంచ్ లో సీబీఐ ధిక్కరణ పిటిషన్ విచారణ లిస్ట్ అయింది. ఒక న్యాయమూర్తి ఈ బెంచ్ లో భాగం కాదలచుకోనందువల్ల  సీబీఐ పిటిషన్ల విచారణ నిలిపేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ ప్రకటించారు. 

తాను గతంలో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నందువల్ల ఈ కేసు విచారణ చేపట్టదలచ లేదని జస్టిస్ నాగేశ్వరరావు తెలిపారు. బెంచ్ ఈ కేసును 27 ఫిబ్రవరిన జస్టిస్ రావు ఉండని బెంచ్ ముందుకు లిస్ట్ చేయనుంది. 

పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ మలయ్ కుమార్ డే, డీజీపీ వీరేంద్ర కుమార్, కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ లు కుంభకోణంలో సీబీఐ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్ పై 18 ఫిబ్రవరిన అత్యున్నత న్యాయస్థానానికి వేర్వేరుగా అఫిడవిట్లు సమర్పించారు. అలాగే బేషరతుగా క్షమాపణలు కోరారు. సీబీఐ ధిక్కరణ పిటిషన్లపై జవాబును సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం వారిని 5 ఫిబ్రవరిన ఆదేశించింది.