అఖిలేష్‌, ములాయంకు సుప్రీం ఝలక్‌

అఖిలేష్‌, ములాయంకు సుప్రీం ఝలక్‌

యూపీ మాజీ సీఎంలు ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌లు అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను రెండు వారాల్లోగా కోర్టుకు తెలపాల్సిందిగా సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ములాయం, అఖిలేష్‌లపై ఉన్న ఇతర కేసుల వివరాలు కూడా తెలపాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన డివిజన్‌ బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ములాయం, అఖిలేష్‌లకు అక్రమాస్తులు ఉన్నాయని, వాటిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ 2005లో కాంగ్రెస్‌ నేత విశ్వనాథ్‌ చతుర్వేది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2007లో అఖిలేష్‌, ములాయంలపై వచ్చిన ఆరోపణలపై  దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.

ఈ ఆదేశాలను సవాలు చేస్తూ 2012లో ములాయం, అఖిలేష్‌లు వేసిన రివ్యూ పిటీషన్లను కోర్టు కొట్టివేసింది. అయితే తాను ప్రజాసేవకురాలిని కాదని,  ఈ కేసు నుంచి తనను మినహాయించాలంటూ అఖిలేష్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ వేసిన పిటీషన్‌ను కోర్టు అనుమతించింది.  ములాయం, అఖిలేష్‌పై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని ఇవాళ మళ్ళీ పిటీషనర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో తాజా పరిస్థితిని వివరించాలని  సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు.