అస్సాం చొరబాటుదారుల కేస్: సీజేఐ వైదొలగాలన్న పిటిషన్ తిరస్కరణ

అస్సాం చొరబాటుదారుల కేస్: సీజేఐ వైదొలగాలన్న పిటిషన్ తిరస్కరణ

ఆస్సాం నిర్బంధ కేంద్రాల్లో అనేక ఏళ్లుగా బందీలై ఉన్న అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారుల బెయిల్ విచారణ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ వైదొలగాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త హర్ష్ మందర్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్ట్ తిరస్కరించింది. అస్సాం నిర్బంధ కేంద్రాల కేసు విచారణ నుంచి వైదొలగేందుకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నిరాకరించారు. అంతే కాకుండా రికార్డుల నుంచి పిటిషనర్ పేరును బెంచ్ తొలగించింది. ఆ స్థానంలో న్యాయ సేవల అథారిటీని ఈ కేసులో పిటిషనర్ గా నియమించింది. మందర్ గత న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అమికస్ క్యూరీగా నియమితులయ్యారు.

ఇటీవలే ఎన్ఆర్సీ వ్యవహారంపై సుప్రీంకోర్ట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తీవ్రంగా ఆక్షేపించింది. చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారిపై ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని కోర్ట్ ప్రశ్నించింది. ప్రస్తుతం అలాంటి వారి పరిస్థితి ఏంటని అస్సాం ప్రధాన కార్యదర్శిని నిలదీసింది. ఎంత మందిని ఈ విధంగా అదుపులోకి తీసుకున్నారని కోర్టు కఠిన పదాలతో అడిగింది. ఈ వ్యవహారంపై వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వాల్సిందిగా సూచించింది. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో భద్రతా బలగాలను సన్నద్ధంగా ఉంచినట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు జవాబు ఇచ్చింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ దళాలు అక్కడే ఉంటాయని తెలిపింది. 

అస్సాంలో అక్రమ చొరబాటుదారులను ఏళ్లకేళ్లుగా నిర్బంధ కేంద్రాల్లో ఉంచడంపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. జనవరి 28న అస్సాంలో ఎన్ని నిర్బంధ కేంద్రాలు ఉన్నాయని కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. గత పదేళ్లలో ఎంత మంది విదేశీయులను నిర్బంధించారని అడిగింది.