సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కార్‌కు షాక్.. సీబీఐ విచారణ జరగాల్సిందే..!

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కార్‌కు షాక్.. సీబీఐ విచారణ జరగాల్సిందే..!

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన వాహనం లభ్యమైనప్పట్టి నుంచి మహారాష్ట్రలో హీట్ పెరిగింది.. ఆ కేసు రోజుకో మలుపు తిరగడం ఓ ఎత్తు అయితే.. మధ్యలో మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలు సంచలనం అయ్యాయి.. మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇవ్వగా.. మహా సర్కార్, అనిల్ దేశ్‌ముఖ్‌.. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు.. కానీ, బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది సర్వోన్నత  న్యాయస్థానం.. 

కాగా, హోంశాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్ చేసిన అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ జరపాలంటూ బాంబే హైకోర్టు సీబీఐకి సూచించగా.. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం, అనిల్ దేశ్‌ముఖ్ పిటిషన్లు దాఖలు చేశారు.. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తులు, నేరం స్వభావం, ఆరోపణల్లో తీవ్రతను బట్టి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది.. ఇది ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయంగా అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు ధర్మాసనం.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తాము జోస్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. దీంతో.. మహారాష్ట్ర సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.