సెన్సార్‌ నిర్ణయమే ఫైనల్‌

సెన్సార్‌ నిర్ణయమే ఫైనల్‌
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) నుంచి అనుమతి పొందిన తర్వాత సినిమాను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సెన్సార్‌ నిర్ణయమే అంతిమం అని తెలిపింది. 'నానక్‌ షా ఫకీర్‌' సినిమాపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆంక్షలు విధించడం సరికాదని సుప్రీం అభిప్రాయపడింది. తమ సినిమా విడుదలకు 'ప్రబంధక్‌ కమిటీ' అడ్డు తగులుతోందంటూ నానక్‌ షా ఫకీర్‌ నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారణ చేపట్టింది. ఒకసారి సీబీఎఫ్‌సీ సర్టిఫై చేశాక విడుదలను అడ్డుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా చిత్ర ప్రదర్శనలను ప్రైవేటు వ్యక్తులుగాని, సంస్థలుగాని అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. ఇవి ఇలాగే కొనసాగితే భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. 'నానక్‌ షా ఫకీర్‌' విడుదలకు అనుమతి ఇచ్చింది. కాగా.. సిక్కుల తొలి గురువు గురునానక్ దేవ్ జీవితం, మత బోధనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రిటైర్డ్‌ నేవీ అధికారి హరీందర్‌ ఎస్‌ సిక్కా నిర్మాతగా వ్యవహరించారు.