పోలింగ్ ఉదయం 4.30కి ప్రారంభించవచ్చా?

పోలింగ్ ఉదయం 4.30కి ప్రారంభించవచ్చా?

ముస్లింల పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా తర్వాత మూడు దశల పోలింగ్ లో ఓటింగ్ ను ఉదయం 7 గంటలకు బదులు 4.30కి ప్రారంభించే అవకాశంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్ట్ గురువారం ఆదేశించింది. రంజాన్ ప్రారంభమయ్యే మే 6న ఐదో దశ పోలింగ్ జరగనుంది. రంజాన్ కారణంగా ఓటింగ్ సమయాన్ని ముందుకు జరపాలని కోరుతూ మొహమ్మద్ నిజాముద్దీన్ పాషా అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నాయకత్వం వహిస్తున్న బెంచ్ ముందు అర్జంట్ లిస్టింగ్ కింద వచ్చింది. దీనిని పరిశీలనకు స్వీకరించిన కోర్టు, దీనిని ఒక అభ్యర్థనగా స్వీకరించి తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఈసీకి సూచించింది.

సుప్రీంకోర్ట్ న్యాయవాది అయిన పాషా 'దేశంలో పలుచోట్ల అనూహ్య స్థాయిలో వడగాడ్పులు వీస్తుండటం, పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కారణంగా' మే 6, 12, 19న జరగాల్సిన మిగిలిన మూడు దశల పోలింగ్ సమయాన్ని కాస్త ముందుకు మార్చాలని తన పిల్ లో కోరారు. 'విపరీతమైన వేడి కారణంగా ముస్లిం ఓటర్లు పోలింగ్ బూత్ ముందు క్యూలలో నిలబడి తమ ఓటుహక్కు వినియోగించుకోవడం కష్టంగా మారుతుంది. రంజాన్ పాటించే ముస్లింలు ఉదయం స్వీకరించే 'సెహ్రీ' కోసం తొందరగా మేలుకొని ఉదయం 'ఫజ్ర్' ప్రార్థనల తర్వాత నిద్రిస్తారు. ఆ తర్వాత వారు దాహం వేయకుండా, నిర్జలీకరణ బారిన పడకుండా, వడదెబ్బ తగలకుండా ఉండేందుకు వీలైనంత వరకు ఎండల్లోకి వెళ్లరని' ఆయన పేర్కొన్నారు. ఈ మూడు దశల పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి 4.30కి మారిస్తే ఫజ్ర్ ప్రార్థనల వెంటనే ఓటు వేసి ఎండలు ముదరకుండా ఇల్లు చేరే వీలు కలుగుతుందని తెలిపారు.