రాహుల్ పౌరసత్వంపై విచారణ వచ్చే వారానికి వాయిదా

రాహుల్ పౌరసత్వంపై విచారణ వచ్చే వారానికి వాయిదా

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై వచ్చే వారం విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఆయన బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉన్నారని, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడంటూ సుప్రీంకోర్టులో ఇద్దరు స్వచ్చంధ కార్యకర్తలు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన వ్యక్తి భారతదేశంలో ఓటు హక్కు కలిగి ఉండడం నేరమని, కావున రాహుల్ పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణను వచ్చే వారం విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

రాహుల్ పౌరసత్వంపై వస్తోన్న ఆరోపణలపై స్పందించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం రాహుల్‌కి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వాస్తవాలేంటో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి నుంచి అందుకున్న ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. రాహుల్‌ గాంధీ భారతీయుడు కాదని.. ఆయనకు బ్రిటిష్‌ పౌరసత్వం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి గత కొంత కాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన 2015లోనే స్పీకర్‌ సుమిత్రామహాజన్‌కు అందజేశారు. వాటి ఆధారంగా రాహుల్‌ను ఎంపీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.