ఎన్నికల బాండ్లపై ముగిసిన వాదనలు, రేపు సుప్రీం తీర్పు

ఎన్నికల బాండ్లపై ముగిసిన వాదనలు, రేపు సుప్రీం తీర్పు

ఎన్నికల బాండ్ల జారీపై సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. సుప్రీంకోర్ట్ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బాండ్లను అడ్డుకోవాలా వద్దా అనే అంశంపై తన తీర్పు ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల జారీకి అనుకూలంగా వాదించింది. ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా ఎన్నికల బాండ్ల అంశంపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సుప్రీంకోర్టును కోరారు. ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని కేంద్రం కోర్టును అభ్యర్థించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. రాజకీయ విరాళాలకు పారదర్శకత, జవాబుదారీ తెచ్చేందుకు ఎన్నికల బాండ్లు ఒక మంచి ముందడుగని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ అన్నారు. ఎన్నికల బాండ్లకు ముందు ఎక్కువ శాతం విరాళాలు నగదు రూపంలో ఇవ్వడం జరిగేదని, దీంతో లెక్కలేనంత ధనం ఎన్నికల్లో ఉపయోగించేవారని ఏజీ తెలిపారు.

ఎలక్టోరల్ బాండ్ల చెల్లింపులు కేవలం చెక్కులు, డ్రాఫ్టులు, ప్రత్యక్ష డెబిట్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. దీంతో ఎవరూ తమ నల్ల ధనాన్ని ఇవ్వలేరు. బుధవారం విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తాము ఎన్నికల బాండ్లకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. అయితే చందా ఇచ్చినవారి గుర్తింపు రహస్యంగా ఉంచడానికి తాము వ్యతిరేకమని తెలిపింది. దీనిపై స్పందిస్తూ ఎన్నికల సంఘం కేంద్రానికి రాసిన లేకలో ఎన్నికల బాండ్లు ఒక మంచి ముందడుగని పేర్కొనడాన్ని గుర్తు చేసింది. కమిషన్ తన వైఖరి మార్చుకుందా అని కోర్టు ప్రశ్నించింది. దీనికి జవాబుగా ఎలక్టోరల్ బాండ్లలో ఏదీ తప్పు కాదని ఈసీ సుప్రీంకోర్టుకు వివరించింది. కానీ విరాళాలు ఇచ్చినవారి పేర్లను బహిర్గతం చేయాలని.. రాజకీయ పార్టీలకు ఫండింగ్ గురించి తెలుసుకొనే అధికారం ప్రజలకు, ఎన్నికల సంఘానికి ఉందని వాదించింది.