తన నీడ చూసి ఆమె భయపడుతోంది

తన నీడ చూసి ఆమె భయపడుతోంది

నిన్న కోల్ కతాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండ రాజకీయ రంగు పులుముకుంది. ప్రతీకారం తీర్చుకుంటానంటూ చెబుతున్న టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరికి తన పగ సాధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. 'రెండు రోజుల క్రితం మమత దీదీ బహిరంగంగా కక్ష సాధిస్తానని ప్రకటించారు. 24 గంటల్లోగా ఆమె తన అజెండా అమలు చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రోడ్ షోపై దాడి జరిగిందని' బెంగాల్ లోని బసిర్హట్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని ఆరోపించారు. 

ఎన్నికల ఫలితాలపై ఆందోళన చెందుతున్న బెంగాల్ ముఖ్యమంత్రి తన నీడ చూసి భయపడుతున్నారని మోడీ అన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రివన్నీ బెదిరింపు వ్యూహాలని ప్రధాని విమర్శించారు. 'రాష్ట్రంలో బీజేపీ గాలి వీయడం చూసి మమత దీదీ భయపడుతున్నారు. ఆమె భయపడినపుడు ఏం చేయగలదో అందరికీ తెలుసని' ఆయన చెప్పారు. రాష్ట్రంలో 5, 6 దశల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ భారీగా గెలవబోతోందని జోస్యం చెప్పారు.

నిన్నటి హింసాకాండపై బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ఒకరిపై మరొకరు విమర్శల దాడి చేసుకుంటున్నాయి. నిన్నటి హింసాకాండలో 19వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త, బెంగాలీల ఆరాధ్యుడఐన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమైంది. దీనికి మీరంటే మీరే కారణమని పార్టీలు ఆరోపించుకుంటున్నాయి.