వచ్చే ఏడాది మార్చి 31వ వరకు పాఠశాలలు...

వచ్చే ఏడాది మార్చి 31వ వరకు పాఠశాలలు...

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ వైరస్‌ కారణంగా మనుషులే కాకుండా చాలా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విద్యా రంగం చాలా నష్టపోయింది. పాఠశాలలు ఎప్పుడు ఓపెన్‌ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల పాఠశాలలు ఓపెన్‌ చేసినప్పటికీ... వందల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. అయితే.. కరోనా మహమ్మారి ప్రభావంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు 1 నుంచి 8 తరగతుల వరకు పాఠశాలలు మూసివేయనున్నట్లు సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఆయా తరగతుల వారికి ఎలాంటి పరీక్షలు కూడా నిర్వహించేది లేదని స్పస్టం చేశారు. పాఠశాల విద్యా విభాగంతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. 10, 12 తరగతులకు మాత్రం బోర్డు పరీక్షల కోసం త్వరలోనే పాఠశాలలు మళ్లీ ప్రారంభించనున్నారు. 9, 11 తరగతులకు వారానికి 1 లేదా 2 సార్లు పాఠశాలలు నిర్వహిస్తారు.