రఫెల్ తీర్పుపై పునస్సమీక్ష అవసరం లేదు

రఫెల్ తీర్పుపై పునస్సమీక్ష అవసరం లేదు

రాఫెల్ డీల్ పై దర్యాప్తు కోరుతూ పునస్సమీక్ష పిటిషన్లపై సోమవారం జరగబోయే విచారణకు ముందుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంపై పీఎంఓ పర్యవేక్షణను సమాంతర బేరసారాలుగా చెప్పడం తప్పని కేంద్రం తన అఫిడవిట్ లో చెప్పింది. డీల్ సరిగానే ఉందన్న సుప్రీంకోర్ట్ తీర్పు సరిగ్గా ఉందని పేర్కొంది. అప్రమాణిక మీడియా కథనాలు, శాఖపరమైన ఫైళ్లలో చేసిన వ్యాఖ్యలను పునర్విచారణకు ఆధారంగా పరిగణించరాదని కోరింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక వార్తాపత్రికలో ప్రచురించిన వార్తాకథనం ఆధారంగా రాఫెల్ డీల్ లో రక్షణ మంత్రిత్వశాఖ, ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొనేందుకు చర్చలు జరుపుతోందని కాంగ్రెస్ అంటోంది. కానీ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఇందులో జోక్యం చేసుకోవడంతో ఫ్రాన్స్ కి లాభం చేకూరిందని ఆరోపించింది. పీఎంఓ జోక్యాన్ని రక్షణ మంత్రిత్వశాఖ వ్యతిరేకించినట్టు తెలిపింది.

కేంద్రం అఫిడవిట్ లో ఏం చెప్పింది?
-డిసెంబర్ లో కోర్టు ఎంతో లోతుగా పరిశీలించిన తర్వాత ఈ రక్షణ ఒప్పందంలో న్యాయస్థానం జోక్యం లేదా దర్యాప్తు అవసరం లేదని నిర్ణయించింది. 
-దొంగిలించిన దస్తావేజుల ఆధారంగా పునస్సమీక్ష పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పత్రాల్లో ఎంపిక చేసిన అంశాలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో సమర్పిస్తున్నారు. పూర్తి విషయం చెప్పడం లేదు.
-రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంపై పీఎంఓ పర్యవేక్షణను సమాంతర బేరసారాలుగా చెప్పడం తప్పు.
-అవసరమైన అన్ని దస్తావేజులు కాగ్ కి ఇవ్వడం జరిగింది. ఆయుధాలతో కూడిన రాఫెల్ మునుపటితో పోలిస్తే దాదాపు 3 శాతం చౌకగా లభించినట్టు కాగ్ నివేదిక ఇచ్చింది.
-ఆఫ్ సెట్ పార్ట్ నర్ ఎంపికలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు. ఒప్పందంలో దీని ప్రస్తావనే లేదు. 36 విమానాలను పూర్తిగా తయారుచేసిన స్థితిలో భారత్ కు అందజేస్తారు.

సుప్రీంకోర్ట్ గత ఏడాది డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పులో 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో పునస్సమీక్ష పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం ఈ పిటిషన్లను వ్యతిరేకించింది. అయినప్పటికీ సుప్రీంకోర్ట్ గత నెల ఏప్రిల్ 10న విచారణకు సిద్ధమైంది.