ఎన్నికల నేపథ్యంలో విమానాశ్రయాల భద్రత కట్టుదిట్టం

ఎన్నికల నేపథ్యంలో విమానాశ్రయాల భద్రత కట్టుదిట్టం

ఏప్రిల్ లో లోక్ సభ ఎన్నికల నిర్వహణ ప్రారంభానికి ముందు అక్రమ ఆయుధాలు, నగదు, బంగారం రవాణాని అడ్డుకొనేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత వాణిజ్య విమానాలతో పాటు ఎయిర్ పోర్ట్ కి వచ్చిపోయే ప్రైవేట్ విమానాలు, హెలీకాప్టర్ల గురించి అన్ని రికార్డులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, ఆ విమానాశ్రయం ఉన్న జిల్లా ఎన్నికల అధికారికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ అందజేయాలని సూచించారు. విమానాల ప్రయాణ ప్రణాళిక వివరాలను కనీసం 30 నిమిషాల ముందుగా ఇవ్వాలని తెలిపారు. 

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్ పోర్ట్స్ అథారిటీ లేదా ఏటీసీ ముందస్తుగా విమానాల రాకపోకల గురించి పోలీసులకు, బీసీఏఎస్, ఆదాయపన్ను శాఖలకు తెలియజేయాల్సి ఉంటుంది. మార్చి 10న ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల పోలింగ్ తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమై మే 19 వరకు ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. మే 23న ఫలితాలను ప్రకటిస్తారు.