భారత్‌కు భారీ టార్గెట్

భారత్‌కు భారీ టార్గెట్

హామిల్టన్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న చివరి టీ20లో న్యూజిలాండ్‌ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసి.. భారత్‌కు 213 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఇద్దరు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీల మోత మోగిస్తూ తొలి వికెట్‌కి 80 పరుగులు జోడించారు. ముఖ్యంగా టిమ్‌ సీఫెర్ట్‌ (43; 25 బంతుల్లో 3x6, 3x4) బౌండరీలే లక్ష్యంగా ఆడాడు. అయితే కుల్దీప్ యాదవ్ వేసిన 8వ ఓవర్ నాలుగో బంతికి ధోనీ.. సీఫెర్ట్‌ని స్టంప్ అవుట్ చేసి పెవిలియన్ చేర్చాడు.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌తో కలిసి మరో ఓపెనర్ మున్రో రెచ్చిపోయాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 72 పరుగులు చేసి పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో విలియమ్‌సన్ (27) కుల్దీప్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివర్‌లో గ్రాండ్‌హోం (30), మిషెల్ (18), టేలర్ (14) చెలరేగి ఆడటంతో కివీస్‌ భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ 2.. భువనేశ్వర్ 1, ఖలీల్ 1 తలో వికెట్ తీశారు.