రైలుకు ఎదురేగి సెల్ఫీలు, పట్టాలపై సాహసాలు..

రైలుకు ఎదురేగి సెల్ఫీలు, పట్టాలపై సాహసాలు..

Image courtesy: Arab News
సాహసం సేయరా డింభకా అన్న మాట నిజమే కానీ.. ప్రాణాలతో ప్రతిక్షణం చెలగాటమాడే వెర్రిమొర్రి చేష్టలకు పాల్పడమని ఎవరూ చెప్పలేదు. అయితే వియత్నాంలోని హనోయి సిటీలో ఈ మధ్య టైమ్ పాస్ కోసమే  సాహసాలు చేసేవాళ్లు కోకొల్లలుగా తయారయ్యారు. వారి ఆసక్తి అంతా.. వేగంగా వచ్చే ట్రెయిన్ ముందు బోర్లా పడుకొని సెల్ఫీ దిగడం, ట్రెయిన్ ముందు వెంట్రుకవాసిలో ట్రాక్ దాటి తప్పించుకొని ఆనందించడం, దాన్ని కెమెరాలో బంధించుకోవడం.. ఇలాంటివన్నమాట. 

వియత్నాంలో 1880ల్లో వలసపాలకులైన ఫ్రాన్స్ వారు రైల్ ట్రాక్ వేశారు. అప్పటి అవసరాల రీత్యా ఇరుకైన గృహ సముదాయాల మధ్యనుంచే ట్రాక్ వేయాల్సి వచ్చింది. ట్రాక్ కు, ఇళ్లకు మధ్య దూరం మీటరున్నర నుంచి గరిష్టంగా 5 మీటర్ల దూరంకన్నా ఎక్కువుండదు. అందుకే దీన్ని ట్రెయిన్ స్ట్రీట్ అంటారు. ఇక్కడి ప్రజలకు ట్రైయిన్ రావడం, పోవడం అనేది ఇళ్లలో ఉండే పెంపుడు జంతువులతో ఉండే సాన్నిహిత్యం లాంటిది. 

వియత్నాం వార్ లో అమెరికన్లు వేసిన బాంబులకు ఆ ట్రాక్ లు చాలావరకు ధ్వంసమయ్యాయి. అయినా ఇప్పటికీ అదే మీటర్ గేజ్ రైలు మార్గమే ఇక్కడి ప్రజలకు చవకైన రవాణా సదుపాయం. అందువల్ల స్థానికులంతా దీన్నే ఉపయోగిస్తారు. ఇరుకైన స్ట్రీట్ లో, ప్రజల్ని పక్కకు తప్పుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ సాగిపోయే ట్రెయిన్ ను చూసేందుకు ఈ మధ్య దూర ప్రాంతాల నుంచి టూరిస్టులు సైతం వస్తున్నారు. ఇంకేముంది? తాము అరుదైన రైల్ ట్రాక్ ను చూశామన్న ఆనందాన్ని శాశ్వతం చేసుకునేందుకు సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఇదే అవకాశంగా తీసుకున్న ఇక్కడి చిరువ్యాపారులు.. కేఫ్ లు సైతం ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ట్రెయిన్ ఎప్పుడొస్తుందా అని సెల్ఫీల కోసం ఎదురుచూసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ట్రాక్ కు రెండువైపులా మిద్దెల్లో ఉండి ఫొటోలు తీసుకునేవారికి ఇప్పుడు కొదువలేదు. అది బిజాగా కనిపించే చిన్నపాటి బిజినెస్ సెంటర్ గా మారిపోయింది.