ఓపెనింగ్‌లోనే 200 పాయింట్లు ఔట్‌

ఓపెనింగ్‌లోనే 200 పాయింట్లు ఔట్‌

షేర్‌ మార్కెట్లో భయానక వాతావరణం కొనసాగుతోంది.  ఏ స్థాయిలోనూ మార్కెట్‌కు మద్దతు అందడం లేదు. నిన్నటి వరకు దేశీయ అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయగా ఇవాళ అంతర్జాతీయ అంశాలు తోడయ్యాయి. నిన్న యూరో మార్కెట్లు, రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లదీ అదే పరిస్థితి. నాలుగు రోజుల తరవాత ప్రారంభమైన చైనా మార్కెట్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి. ఇక మన మార్కెట్ల విషయానికొస్తే.. కొన్ని గంటల్లో ఆర్బీఐ పరపతి విధానం వెల్లడి కానున్న నేపథ్యంలో మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రారంభంలోనే దాదాపు 200 పాయింట్లు క్షీణించి.. ఇపుడు 120 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా ఇపుడు 60 పాయింట్ల నష్టంతో 10,539 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకు షేర్లు మార్కెట్‌కు అండగా నిలిచాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఒక రూపాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భరించాలని కేంద్రం ప్రకటించడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భారీగా నష్టపోయాయి. నిన్న, ఇవాళ్టి నష్టాలు కలిపితే దాదాపు వాటి విలువ సగానికి పడిపోయింది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇన్‌ఫ్రాటెల్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌, ఐషర్‌ మోటార్స్, భారతీ ఎయిర్‌ టెల్‌ లాభాల్లో ఉన్నాయి. ఇక నష్టపోయిన షేర్లన్నీ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లే. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు ఇవాళ 20 శాతంగా పైగా క్షీణించాయి. ఇక ఐఓసీ 18 శాతం, గెయిల్‌ 13 శాతం, ఓఎన్‌జీసీ 10 శాతం క్షీణించాయి.