స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

రూపాయి ప‌త‌నం స్టాక్ మార్కెట్ల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. సూచీలు స్వ‌ల్పంగా త‌గ్గినా.. అనేక షేర్లు భారీ న‌ష్టాల‌తో ముగుస్తున్నాయి. నిన్న యూరో మార్కెట్ నిస్తేజంగా ముగియగా.. అమెరికా మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. రాత్రి డాల‌ర్ ఇండెక్స్ స్వ‌ల్పంగా త‌గ్గిన‌ట్లు క‌న్పించినా... ముడి చ‌మురు ధ‌ర‌లు మూడు శాతంపైగా పెర‌గ‌డంతో... ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. కీల‌క సూచీల‌న్నీ 14 నెల‌ల క‌నిష్ఠ స్థాయిల‌కు చేరాయి. జ‌పాన్ నిక్కీ, హాంగ్ సెంగ్‌ల‌తోపాటు చైనా సూచీలు న‌ష్టాల్లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభంమైంది. ఎఫ్ఎంసీజీ షేర్లు వెలుగులో ఉన్నాయి. ఇత‌ర షేర్లు స్వ‌ల్ప న‌ష్టాల్లో ఉన్నాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డం, డాల‌ర్ ఇవాళ పెర‌గ‌డంతో దేశీయ ఇన్వెస్ట‌ర్ల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. పైకి సూచీలు స్వ‌ల్పంగా క్షీణిస్తున్న‌ట్లు క‌న్పిస్తున్నా అనేక మ‌ధ్య‌, చిన్న త‌ర‌హా షేర్లు భారీగా న‌ష్ట‌పోతున్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ప‌వ‌ర్ గ్రిడ్ టాప్ లో ఉంది. గ‌త కొన్నిరోజులుగా భారీగా క్షీణించిన బ‌జాజ్ ఫైనాన్స్‌, ఐటీసీ, హిందుస్థాన్ లీవ‌ర్, ఓఎన్‌జీసీ షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి.  ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో ఐఓసీ,హిందుస్థాన్ పెట్రోలియం, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, టైటాన్  ఉన్నాయి. ముఖ్యంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్ల‌పై ఒత్తిడి పెరుగుతోంది.