భారీ లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

భారీ లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

తొమ్మిది రోజుల వ‌రుస న‌ష్టాల నేప‌థ్యంలో ఇవాళ మార్కెట్ భారీ లాభాల‌తో ప్రారంభ‌మైంది. నిఫ్టి ప్రస్తుతం 87 పాయింట్ల లాభంతో 10,691 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. వ‌రుస భారీ లాభాలు ఆర్జించిన‌ అంత‌ర్జాతీయ మార్కెట్లు నిన్నటి నుంచి స్థిరంగా ఉన్న నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభ‌మ‌య్యాయి. నిన్న యూరో మార్కెట్లు ఒక మోస్తరు న‌ష్టాల‌తో క్లోజ్ కాగా... అమెరికా మార్కెట్లు నిస్తేజంగా ముగిశాయి. ఈ నేప‌థ్యంలో ప్రారంభ‌మైన ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ప్రధాన మార్కెట్లు మాత్రం న‌ష్టాల్లో ఉన్నాయి. అయితే లాభ‌న‌ష్ఠాల్లో పెద్ద తేడా లేదు. నిఫ్టి ప్రస్తుతం చాలా కీల‌క స్థాయిల‌ను ఎదుర్కొంటోంది. 10,750ని దాటితే త‌ప్ప లాభాల ట్రెండ్ కొన‌సాగే ఆస్కారం త‌క్కువ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, వేదాంత‌, టాటా స్టీల్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాల్లో ముందున్నాయి. న‌ష్టాల్లో ముందున్నవాటిలో ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌సీఎల్ టెక్‌, బ‌జాజ్ ఆటో, హీరో మోటోకార్ప్‌, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ విత్తనాల విక్రయంపై నిషేధం విధించ‌డంతో  కావేరీ సీడ్స్ షేర్ల‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. గ‌త మూడు రోజుల్లో కంపెనీ షేర్ 30 శాతంపైగా త‌గ్గింది. ఇవాళ మ‌రో 8 శాతం క్షీణించి రూ. 386 వ‌ద్ద ట్రేడ‌వుతోంది.