వచ్చే జూన్‌కల్లా సెన్సెక్స్‌ 44,000!

వచ్చే జూన్‌కల్లా సెన్సెక్స్‌ 44,000!

రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా.. స్టాక్‌ మార్కెట్‌ మాత్రం దూసుకుపోనుంది. వచ్చే ఏడాది జూన్‌కల్లా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 44,000 స్థాయికి చేరుకుంటుందని ప్రముఖ స్టాక్‌ బ్రోకరేజి సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. ఆర్థికవృద్ధి రేటు, బ్లూచిప్‌ కంపెనీల వ్యాల్యూయేషన్‌ పెరగడంతో పాటు బేటా తక్కువగా ఉండటం.. బుల్‌ రన్‌కు కారణమని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. అంటే ఇప్పటి స్థాయి 35,548 పోలిస్తే ఇక్కడి నుంచి మరో 24 శాతం సెన్సెక్స్‌ పెరగనుందన్నమాట. అంతర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా ఉన్నా...భారత మార్కెట్లు బాగా రాణిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేసింది. ఎన్నికల ఏడాది కావడం, ముడి చమురు ధరలు పెరగడం వంటి ప్రతికూల అంశాలున్నా... సెన్సెక్స్‌ రాణిస్తుందని పేర్కొంది. ఒక ఎన్నికల్లో ప్రతికూల అంశాలున్నా మార్కెట్‌ బేర్‌స్థాయి అంటే 26500కి పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంది. 


వీటిల్లో పెట్టుబడి..
భవిష్యత్తులో మంచి రాబడి కోసం ప్రైవేట్‌ బ్యాంకులు, కన్జూమర్‌ గూడ్స్‌తో పాటు ఇండస్ర్టియల్‌ మెటీరియల్‌ రంగానికి చెందిన షేర్లలో పెట్టుబడి పెట్టడం మంచిదని మోర్గాన్‌ స్టాన్లీకి చెందిన రిధమ్‌ దేశాయ్‌, శీలా రాథి పేర్కొన్నారు. జనం వద్ద వాస్తవ ఆదాయం పెరుగుతుందని, దీనివల్ల కన్జూమర్‌ లోన్‌ రంగంలో వృద్ధి చాలా ఆశాజనకంగా ఉంటుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. ప్రజల వద్ద నిధులు అధికంగా ఉన్నందున కన్జూమర్‌ గూడ్స్‌ వినియోగం బాగుంటుందని, అలాగే ప్రభుత్వం కూడా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నందున క్యాపిటల్‌ మెటీరియల్‌ రంగం కూడా రాణిస్తుందని ఈ బ్రోకరేజి సంస్థ పేర్కొంది.