క‌రోనా వ్యాక్సిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచ‌ల‌నం..! సాధ్యం కాదా..?

క‌రోనా వ్యాక్సిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచ‌ల‌నం..! సాధ్యం కాదా..?

కంటికి క‌నిపించ‌ని అతి సూక్ష్మ‌మైన వైర‌స్.. ఇప్పుడు ప్రపంచదేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. రోజురోజ‌కీ క‌రోనా పాజిటివ్ కేసులు కొత్త రికార్డు త‌ర‌హాలో పైకి జ‌రుగుతూనే ఉన్నాయి.. మ‌ర‌ణాలు కూడా పెరిగిపోతున్నాయి.. ఇక‌, క‌రోనాకు చెక్ పెట్టేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో సంస్థ‌లు.. మందులు, వ్యాక్సీన్ ఇలా ఏదో ఒక‌దానిపై ప్ర‌యోగాలు కొన‌సాగిస్తూనే ఉన్నాయి.. కొన్ని క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కూడా పూర్తిచేసుకున్నా.. ఇంకా అందుబాటులోకి మాత్రం రాలేదు.. ప్ర‌తీరోజూ.. క‌రోనా వ్యాక్సిన్‌పై వ‌చ్చే వార్త‌లు ప్ర‌జ‌ల‌ను ఊరిస్తూనే ఉన్నాయి.. అయితే.. క‌రోనా వ్యాక్సిన్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది...ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో).. వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూడవద్దని గ‌తంలోనే తేల్చేసిన ఆ సంస్థ‌.. ఇప్పుడు సమర్థవంతమైన వ్యాక్సిన్ల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, కొత్త రకం కరోనా వైరస్‌కు సిల్వర్ బుల్లెట్ సమాధానం ఎప్పుడూ ఉండదని పేర్కొంది.

ప్రస్తుతం కోవిడ్‌కు సమర్థవంతమై వ్యాక్సిన్ లేదు.. భవిష్యత్తులోనూ రాబోదంటూ డబ్ల్యూహెచ్‌వో కోవిడ్-19 అత్యవసర కమిటీ సమావేశం సందర్భంగా ఆ సంస్థ డైరెక్ట‌ర్ జనరల్ టెడ్రోస్ వ్యాఖ్యానించారు. ఆర్థిక సంక్షోభానికి కారణమైన మహమ్మారిని అణిచివేసి, సాధారణ జీవితాన్ని ప్రారంభించడానికి పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, భౌతిక దూరాన్ని పాటించడం, మాస్క్ ధరించడం వంటి తెలిసిన ప్రాథ‌మిక చ‌ర్య‌ల‌ను పాటించడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. కరోనాను పూర్తిగా క‌ట్ట‌డిచేసే వ్యాక్సిన్లు రావాలని ఎదురుచూస్తున్నాం.. కానీ, ప్రస్తుతానికి దీనికి సమాధానం లేదు, ఎప్పుడూ ఉండకపోవచ్చు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా అనేక యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్లు ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ 3వ దశలో ఉన్నాయ‌ని.. టీకాలు త్వరలో మనకు లభిస్తాయని ఆశిస్తున్న‌ట్టు తెలిపారు.