డీఎస్ కొడుకుపై లైంగిక ఆరోపణలు

డీఎస్ కొడుకుపై లైంగిక ఆరోపణలు

రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకు ధర్మపురి సంజయ్ మీద మళ్లీ లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత అమ్మాయిలు ఏకంగా తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రగతిశీల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంధ్య బాధిత విద్యార్థినులకు అండగా నిలిచి వారిని సచివాలయానికి తీసుకొచ్చి హోంమంత్రికి వినతిపత్రం సమర్పించారు. రెండు పేజీల వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం డీఎస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ శాంకరీ నర్సింగ్ కళాశాల నడుపుతున్నాడు. ఆ కళాశాలలో 2018 జనవరిలో నర్సింగ్ కోర్సు ప్రథమ సంవత్సరంలో మొత్తం 13 మంది విద్యార్థినులు అడ్మిషన్లు పొందారు. వారిలో ఇప్పటివరకు 11 మందిని లైంగికంగా వేధించాడని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. తమతో కళాశాల ఛైర్మన్ సంజయ్ అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. కొందరిని అసభ్యకరమైన మాటలతో వేధించాడని, కొందరు అమ్మాయిలను బలవంతంగా తన గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి దుస్తులు విప్పాలంటూ వేధించాడని ఆరోపించారు.