సీజేఐని సమర్థించే లాయర్ కి నోటీసులు, రేపు సుప్రీం విచారణ

సీజేఐని సమర్థించే లాయర్ కి నోటీసులు, రేపు సుప్రీం విచారణ

సుప్రీంకోర్ట్ న్యాయవాది ఉత్సవ్ బైంస్ కు కోర్టు ముగ్గురు జడ్జిల బెంచ్ నోటీసు జారీ చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ రోహింటన్ ఫలీ నారీమన్, జస్టిస్ దీపక్ మిశ్రాల బెంచ్ ఈ కేసు విచారణ జరుపుతుంది. తను దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలను స్పష్టం చేయాల్సిందిగా కోర్టు బైంస్ ను ఆదేశించింది.

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను బైంస్ ఖండించారు. ఇది కేవలం ఒక కుట్ర అని ఆయన తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. సీజేఐ రంజన్ గొగోయ్ ను పదవి నుంచి దించేందుకు కుట్రపూరితంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. దీని వెనుక జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ హస్తం ఉండవచ్చని బైంస్ అనుమానం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో తనను కలిసిన ఒక అజ్ఞాత వ్యక్తి రూ.1.5 కోట్లు ఇస్తానని, అందుకు బదులుగా సీజేఐకి వ్యతిరేకంగా మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాల్సిందిగా తనను కోరినట్టు బైంస్ చెప్పారు. దీంతో సీజేఐ రంజన్ గొగోయ్ ఆందోళన చెంది తన పదవికి రాజీనామా చేయాలని ఆ వ్యక్తి ప్రణాళిక రచించినట్టు తెలిపారు. అయితే తాను ఆ ఆఫర్ తిరస్కరించినట్టు బైంస్ పేర్కొన్నారు. బైంస్ ఈ మొత్తం వ్యవహారాన్ని తన ఫేస్ బుక్ పోస్ట్ లో పెట్టారు. ఆ వ్యక్తి ఆసారామ్ కేసులో బాధితురాలి పక్షాన తను వాదించిన తీరును ప్రశంసించి. తను ప్రస్తుత కేసులో బాధితురాలి బంధువునని పరిచయం చేసుకున్నట్టు బైంస్ తెలిపారు. కానీ తనకు మాత్రం అలా కనిపించలేదని, అతనో ట్రేడ్ ఏజెంట్ మాదిరిగా మాట్లాడినట్టు చెప్పారు. తను అడిగిన ప్రశ్నలు వేటికీ అతను సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ కేసులో బాధితురాలితో అతని చుట్టరికం ఏంటని ప్రశ్నిస్తే హఠాత్తుగా ఈ కేసు చేపడితే రూ.50 లక్షలు ఇస్తానని చెప్పినట్టు బైంస్ గుర్తు చేసుకున్నారు.

తన ఆఫీస్ నుంచి వెళ్లిపోమ్మని తాను ఆ వ్యక్తిని కోరినట్టు బైంస్ తెలిపారు. తను ఢిల్లీలో విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ వ్యవహారంపై పరిశోధన జరిపిస్తే సుప్రీంకోర్ట్ సీజేఐకి వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతున్నట్టు తెలిసిందని చెప్పారు. ఆయనతో రాజీనామా చేయించేందుకే ఇదంతా చేస్తున్నారని తెలుసుకున్న తాను, ఆయనను హెచ్చరించేందుకు ఆయన ఇంటికి వెళ్తే ఆయన లేరని పేర్కొన్నారు. 

తన సీడీఆర్ టవర్ లొకేషన్ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు సేకరించినట్టు బైంస్ వివరించారు. తన అంతరాత్మ మాట విని తాను ఈ కుట్ర గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు ముందుకొచ్చానని తెలిపారు.