సచిన్‌, ధోనీని కాదని.. కోహ్లీకి చోటు!

సచిన్‌, ధోనీని కాదని.. కోహ్లీకి చోటు!

సచిన్‌ టెండూల్కర్‌.. ఈ లిటిల్‌ మాస్టర్‌ పరుగులు చేయని పిచ్‌ లేదు.. నెలకొల్పని రికార్డు లేదు. భారత జట్టు తరఫున సచిన్‌ ఆడినా.. 'మాకూ ఓ సచిన్‌ ఉంటే బాగుండేది' అని వివిధ దేశాల దిగ్గజ ఆటగాళ్లు ఏదో ఓ సందర్భంలో వ్యాఖ్యానించినవారే. సచిన్‌ 'ఊ..' అనాలేగానీ.. ఇప్పటికీ ఆయణ్ను ఏ జట్టయిన ఎంపిక చేసుకుంటుందంటే అతిశయోక్తి కాదేమో..! కానీ.. పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది మాత్రం తన ఆల్‌టైమ్‌ వరల్డ్‌ కప్‌ జట్టులో మన టెండూల్కర్‌కి చోటివ్వలేదు. ఐసీసీ ప్రపంచకప్‌ 2019కు సమయం ఆసన్నమైన నేపథ్యంలో అఫ్రిది తన 'ఆల్‌టైమ్‌ వరల్డ్‌ కప్‌ లెవన్‌'ను ప్రకటించాడు. సచిన్‌తోపాటు ధోనీని కూడా పక్కన పెట్టిన అఫ్రిది.. విరాట్‌ కోహ్లీ వైపు మాత్రం మొగ్గు చూపాడు. ఓపెనర్లుగా  సయీద్‌ అన్వర్‌, గిల్‌క్రిస్ట్‌ను, ఫస్ట్‌ డౌన్‌లో రికీ పాంటింగ్‌ను ఎంపిక చేసిన అఫ్రిది.. నంబర్‌ 4 స్థానాన్ని కోహ్లీకి కేటాయించాడు. ఆ తర్వాతి స్థానంలో ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, జాక్వస్‌ కలిస్‌ను ఎంపిక చేశాడు. బౌలింగ్‌ విభాగంలో వసీం అక్రమ్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, షేన్‌ వార్న్‌, షోయబ్‌ అక్తర్‌, సక్లయిన్‌ ముస్తాక్‌ల వైపు మొగ్గు చూపాడు. 

అఫ్రిది ఎంపిక చేసిన 'ఆల్‌టైమ్‌ వరల్డ్‌ కప్‌ లెవన్‌'
సయీద్‌ అన్వర్‌, గిల్‌క్రిస్ట్‌, రికీ పాంటింగ్‌, విరాట్‌ కోహ్లీ, ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, జాక్వస్‌ కలిస్‌, వసీం అక్రమ్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, షేన్‌ వార్న్‌, షోయబ్‌ అక్తర్‌, సక్లయిన్‌ ముస్తాక్‌