భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లన్నీ గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ఉదయం ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఇపుడు యూరో మార్కెట్లు కూడా భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం రూపాయి బలపడటంతో మన మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. క్రమంగా పెరుగుతూ వచ్చిన నిఫ్టికి యూరో మార్కెట్ల మద్దతు అందింది. రూపాయి బలహీనపడినా.. నిఫ్టి లాభాలు మాత్రం కొనసాగాయి. చిత్రంగా ముడి చమురు ధరలు కూడా ఒకటిన్నర శాతం పెరిగాయి. ఈనేపథ్యంలో కూడా నిఫ్టి 101 పాయింట్ల లాభంతో 10,628 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే సెన్సెక్స్‌ 373 పాయింట్ల లాభంతో క్లోజైంది. 

ఇవాళ మెటల్‌, ఫార్మా రంగాల సూచీలు ఒకశాతంపైగా నష్టంతో క్లోజయ్యాయి. డల్‌గా ఉన్న ఐటీ షేర్ల సూచీ.. తరువాత కోలుకుని ఒక శాతంపైగా లాభపడింది. ప్రైవేట్‌ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌ రంగ షేర్ల సూచీలు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో హీరో మోటో కార్ప్‌ ఆరు శాతంపైగా లాభపడింది. విప్రో నాలుగు శాతం పెరిగింది. హిందుస్థాన్‌ లీవర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు ఆకర్షణీయ లాభాలతో క్లోజయ్యాయి. ఇక నష్టాల్లో టాప్‌లో ఉన్న నిఫ్టి షేర్లలో ఓఎన్‌జీసీ, సన్‌ ఫార్మా, ఎస్‌ బ్యాంక్‌, వేదాంత, కోల్‌ ఇండియా ఉన్నాయి. ఇతర షేర్లలో ఐడియా నాలుగు శాతం క్షీణించగా, అదానీ వపర్‌ ఆరు శాతం పెరిగింది.