భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

దేశీయంగా రాజకీయ పరిస్థితులపై క్లారిటీ రావడంతో స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్ళాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో పాటు చైనా, అమెరికాల మధ్య వాణిజ్య సమస్యలు పరిష్కారం కాగలవన్న ధీమాతో మార్కెట్లు ఓపెనింగ్‌ నుంచి లాభపడ్డాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటికీ.. మోడీ మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని మార్కెట్‌లోని ఓ వర్గం భావిస్తోందని కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటన్నింటి మధ్య కొత్త ఆర్బీఐ గవర్నర్‌ను నియమించడం, ఆయన పదవీ బాధ్యతలు కూడా తీసుకోవడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ బాగా పెరిగింది. ఒకదశలో నిఫ్టి 200 పాయింట్ల వరకు లాభపడినా..188 పాయింట్ల లాభంతో 10,737 వద్ద నిఫ్టి ముగిసింది. సెన్సెక్స్‌ కూడా 629 పాయింట్ల లాభంతో క్లోజైంది.

అన్ని రంగాల షేర్ల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. రియాల్టి, ఆటో రంగ షేర్ల సూచీ నాలుగు శాతం పెరగ్గా.. ప్రభుత్వం, ప్రైవేట్‌ బ్యాంకు షేర్లతో పాటు మెటల్‌ షేర్ల సూచీ రెండు శాతం పెరిగాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హీరో మోటోకార్ప్‌, అదానీ పోర్ట్స్‌, యూపీఎల్‌ షేర్లు 5 శాతం నుంచి 7 శాతం లాభంతో ముగిశాయి. ఇక నష్టపోయిన షేర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ 4 శాతం నష్ఠంతో టాప్‌ లూజర్స్‌లో ఉంది. ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌పీసీఎల్‌, టైటాన్‌ షేర్లు నామమాత్రపు నష్టంతో క్లోజయ్యాయి. యాక్టివ్‌గా ఉన్న ఇతర షేర్లలో ఎస్‌ బ్యాంక్‌, జేపీ అసోసియేట్స్‌ 4 శాతంపైగా లాభంతో క్లోజయ్యాయి.