భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

శివరాత్రి సెలవు తరవాత ఓపెనైన మార్కెట్‌ ఇవాళ శివాలెత్తింది. ఉదయం స్వల్ప నష్టంతో ప్రారంభమైన నిఫ్టి తరవాత ఏ దశలోనూ తగ్గలేదు. క్రితం ముగింపు 10,863 కాగా.. 10,854 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని క్షణాల్లోనే 10,817కు క్షీణించింది. అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి 10,994కు చేరింది. చివర్లలో ఏకంగా 124 పాయింట్ల లాభంతో 10,987 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 378 పాయింట్లు పెరిగింది. ఇవాళ ప్రధాన షేర్ల కన్నా చిన్న, మధ్య తరహా షేర్ల హవా జోరుగా సాగింది. ఈ రెండు సూచీలు ఏకంగా నాలుగు శాతం వరకు పెరిగాయి. నిఫ్టి మెటల్‌, బ్యాంక్‌ సూచీలు కూడా భారీ లాభాలు గడించాయి. ఒక్క ఐటీ మినహా మిగిలిన అన్ని సూచీలు ఉరకలెత్తాయి. అనేక షేర్లు 5 నుంచి 10 శాతం దాకా పెరిగింది. టేకోవర్‌ వదంతులతో 5 వద్ద ప్రారంభమైన సుజ్లాన్‌ పరుగు ఇవాళ రూ. 7.60కి చేరింది. ఈ ఒక్క రోజే ఈ షేర్‌ 30 శాతం దాకా పెరిగింది.

ఇక నిఫ్టి ప్రధాన షేర్లను తీసుకుంటే టాప్‌ గెయినర్స్‌ జాబితాలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఐషర్‌ మోటార్స్‌, టాటా మోటార్స్‌, హెచ్‌పీసీఎల్‌,  బీపీసీఎల్‌ ముందున్నాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో ముందున్న షేర్లలో విప్రో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సిప్లా ఉన్నాయి. ఇక బీఎస్‌ఈలో భారీగా పెరిగిన షేర్లలో రెప్కో ఫైనాన్స్‌ (20 శాతం) డీబీ లిమిటెడ్‌ (15 శాతం) మన్‌ పసంద్‌ (12.7 శాతం) డీసీఎం శ్రీరామ్‌ (12.5 శాతం) గెయినర్స్‌లో ముందున్నాయి. ఇక నష్టపోయిన వాటిల్లో ఇక్రా, ఎంజీఎల్‌, ఎంఫసిస్‌ కూడా ఉన్నాయి.