భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

మార్చి డెరివేటివ్‌ కాంట్రాక్ట్స్‌కు గడువు దగ్గర పడుతుండటం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల మధ్య మన మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఆరంభంలోనే దాదాపు వంద పాయింట్లు నష్టపోయిన నిఫ్టి.. 2.30కల్లా ఏకంగా 140 పాయింట్లకు పైగా క్షీణించి 11,311కు తగ్గింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని 11,395 వద్ద ముగిసింది. ఇవాళ్టికి ఇదే గరిష్ఠ స్థాయి కూడా. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 102 పాయింట్లు నష్టపోగా.. సెన్సెక్స్‌ 355 పాయింట్లు క్షీణించింది.  ఉదయం ఆసియా మార్కెట్లు రెండు నుంచి మూడు శాతం నష్టపోగా.. మిడ్‌ సెషన్‌ సమయంలో ప్రారంభమైన యూరో మాత్రం మిశ్రమంగా ఉన్నాయి.

లాభనష్టాల్లో పెద్ద మార్పు కూడా లేదు. నిఫ్టి ప్రధాన షేర్లలో ఐఓసీ, ఓఎన్‌జీసీ షేర్లు నాలుగు శాతం పెరగ్గా.. హెచ్‌పీసీఎల్‌, కోల్‌ ఇండియా, పవర్‌ గ్రిడ్‌ షేర్లు రెండు నుంచి రెండున్నర శాతం లాభంతో ముగిశాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 4 శాతంపైగా నష్టపోయి టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఇన్‌ఫ్రాటెల్‌, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు మూడు శాతంపైగా నష్టపోగా.. టాటా మోటార్స్‌ రెండున్నర శాతం క్షీణించింది. ఇతర షేర్లలో జెట్‌ ఎయిర్‌వేస్‌ 15 శాతం పెరిగింది. కంపెనీ బోర్డు నుంచి జెట్‌ ప్రమోటర్లు వైదొలగడంతో ఈ షేర్‌ భారీగా పెరిగింది. ఇక ఆర్‌ఈసీ కూడా 11 శాతం లాభపడింది. బీఎస్‌ఈలో లాభపడిన ఇతర షేర్లలో టీటీకే ప్రిస్టేజి, పీఎఫ్‌సీ, ఐఓసీ 5 శాతం వరకు పెరిగాయి. నష్టపోయిన వాటిలో ఐడియా, డిష్‌ టీవీ, ఎడల్‌వైసస్‌ ఉన్నాయి. ఈ షేర్లు అయిదు శాతంపైగా నష్టపోయాయి.