భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మళ్ళీ భారీగా క్షీణించింది. దీని ప్రభావం స్టాక్‌ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. డాలర్‌ పెరగడంతో పాటు చమురు ధరలు కూడా పెరగడంతో మనదేశంపై డబుల్‌ ఎఫెక్ట్‌ పడింది. ఫలితంగా డాలర్‌కు డిమాండ్ పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ 97.46కి చేరింది. సరఫరా తగ్గిస్తామని సౌదీ చేసిన ప్రకటనతో క్రూడ్‌ ధరలు ఒకటిన్నర శాతం పెరిగింది. ఆరంభంలో 50 పాయింట్లకు పైగా పెరిగిన నిఫ్టి తరవాత క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఆసియా మార్కెట్ల గ్రీన్‌లో ఉన్నా.. ప్రభావం అంతంత మాత్రమే. మిడ్‌సెషన్‌ తరవాత ప్రారంభమైన యూరో మార్కెట్లలో మిశ్రమ ధోరణి వ్యక్తం కావడంతో నిఫ్టి ఏకంగా 103 పాయింట్ల నష్టంతో క్లోజైంది. సెన్సెక్స్‌ 345 పాయింట్లు క్షీణించింది. 

ఇవాళ నిఫ్టిలో భారీ లాభాలతో ముగిసిన షేర్లలో టైటాన్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ షేర్‌ ఏకంగా ఆరు శాతం లాభపడింది. టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు రెండు శాతం దాకా పెరిగాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి టాప్‌ షేర్లలో హెచ్‌పీసీఎల్‌, టాటా మోటార్స్‌, ఐఓసీ, హీరో మోటోకార్ప్‌, హిందాల్కో ఉన్నాయి. జెఎల్‌ఆర్‌ అమ్మకాలు క్షీణించడంతో టాటా మోటార్స్‌లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఇతర షేర్లలో చక్కెర షేర్లు గణనీయంగా లాభపడ్డాయి.