స్థిరంగా ముగిసిన నిఫ్టి

స్థిరంగా ముగిసిన నిఫ్టి

డిసెంబర్ సిరీస్‌ స్థిరంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి చాలాసార్లు నిఫ్టి 10,900 స్థాయిని దాటినా.. యూరో మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండటంతో మన మార్కెట్లలో కూడా ఇన్వెస్టర్లు అధిక స్థాయిల వద్ద లాభాలు స్వీకరించారు. దీంతో నిఫ్టి కేవలం 18 పాయింట్ల స్వల్ప లాభంతో ముగిసింది. సెన్సెక్స్ లాభం కూడా కేవలం 23 పాయింట్లకే పరిమితమైంది. ముడి చమురు ధరలు ఒక శాతం వరకు నష్టపోయాయి. డాలర్‌ ఇండెక్స్‌ కూడా స్థిరంగా ఉంది. దీంతో రూపాయి బలంగా ఉన్నా లాభాలు పరిమితంగా ఉన్నాయి. ఉదయం ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మన మార్కెట్లలో నిన్న బాగా క్షీణించిన ఐటీ, ఫార్మా షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. అలాగే రియాల్టి షేర్లు కూడా. మిగిలిన రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెద్దగా లేదు. 

నిఫ్టి ప్రధాన షేర్లలో ఎస్‌ బ్యాంక్‌ ఆరు శాతం పైగా లాభపడి టాప్‌లో ఉంది. తరువాతి స్థానాల్లో విప్రో, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, టెక్‌ మహీంద్రా ఉన్నాయి. ఇక నష్టపోయిన షేర్లలో హెచ్‌పీసీఎల్‌ నాలుగున్నర శాతం లాభంతో ముందుంది. తరవాతి స్థానాల్లో ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, యూపీఎల్‌, ఎన్‌టీపీసీ షేర్లు ఉన్నాయి. చురుగ్గా ట్రేడైన ఇతర షేర్లలో ఆర్‌ కామ్‌ 13 శాతం లాభపడింది. స్పెక్ట్రమ్‌ అమ్మకం వ్యవహారానికి వారంలోగా అనుమతి ఇవ్వమని టెలికాం విభాగానికి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈ కంపెనీ షేర్ ధర పెరిగింది. మరో టెలికాం కంపెనీ ఐడియా ఏడు శాతం నష్టంతో క్లోజైంది.