లాభాలతో నిఫ్టి ప్రారంభం

లాభాలతో నిఫ్టి ప్రారంభం

దిగువ స్థాయిలో మార్కెట్‌కు స్వల్ప మద్దతు అందుతోంది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా దీనికి తోడవుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు దాదాపు ఒకశాతం క్షీణించినా.. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా హాంగ్‌సెంగ్‌ ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతుండగా, జపాన్‌ నిక్కీ ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. డాలర్‌ స్వల్పంగా క్షీణించగా, 60 డాలర్లలోపు బ్రెంట్‌ క్రూడ్‌ మద్దతు అందుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు లాభాలతో ప్రారంభయ్యాయి. నిఫ్టి ప్రస్తుతం 53 పాయింట్ల లాభంతో 10,792 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 195 పాయింట్లు లాభపడింది.

నిన్న భారీగా క్షీణించిన పలు షేర్లు ఇవాళ కోలుకున్నాయి. ముఖ్యంగా టీసీఎస్‌ రూ. 14 లాభంతో ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్‌లో అప్‌ట్రెండ్‌ కొనసాగుతోంది. నిన్న దాదాపు నాలుగు శాతం లాభం పడిన ఈ షేర్‌ ఇవాళ కూడా మరో రూ. 11  పెరిగింది. ఇక ఎస్‌ బ్యాంక్‌ కౌంటర్లో నిన్న భారీగా వచ్చిన ర్యాలీ ఇవాళ కూడా కొనసాగుతోంది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఎస్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌ కాగా, తరవాతి స్థానాల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, టెక్‌ మహీంద్ర, విప్రో ఉన్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి ప్రధాన షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఎన్‌టీపీసీ షేర్లు చాలా స్వల్ప నష్టంతో ట్రేడవుతున్నాయి. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజీనామాతో నిన్న దాదాపు రూ. 5 తగ్గిన ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్‌ ఇవాళ స్వల్పంగా కోలుకుని రూ. 91.25 వద్ద ట్రేడవుతోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో తాజా పెట్టుబడులు పెట్టేందుకు ఎతిహాద్‌ అంగీకరించడంతో ఈ షేర్‌ 5 శాతం లాభంతో ట్రేడవుతోంది.