చివర్లో అమ్మకాల ఒత్తిడిః నిఫ్టి డౌన్‌

చివర్లో అమ్మకాల ఒత్తిడిః నిఫ్టి డౌన్‌

రోజంతా మార్కెట్‌ తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. డాలర్‌తో పాటు ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ ఇవాళ కనిష్ఠ స్థాయిలో కొత్త రికార్డు సృష్టించింది. ఫార్వర్డ్ మార్కెట్‌లో డిసెంబర్‌ నెల కాంట్రాక్ట్‌ ఏకంగా 75.10ని దాటింది. స్పాట్‌ మార్కెట్‌లో రూపాయి 74.35కు చేరింది. దేశ చరిత్రలో ఈ స్థాయిలో రూపాయి బలహీనపటడం ఇదే మొదటిసారి. రూపాయిని బలపర్చేందుకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వచ్చే రెండు నెలలకు దిగుమతి దారులు డాలర్లను కొంటున్నారు. దీంతో రూపాయి విలువ మరింత బక్కచిక్కి 75కి పడిపోయింది. దీని ప్రభావం మార్కెట్‌పై తీవ్రంగా పడింది. అలాగే టాటా మోటార్స్‌ షేర్‌ 18 శాతం దాకా క్షీణించడంతో... చివర్లో కూడా కోలుకోకపోవడంతో నిఫ్టి 47 పాయింట్లు, సెన్సెక్స్‌ 174 పాయింట్ల నష్టంతో ముగిశాయి. 

ఆటో, ఎఫ్‌ఎంసీజీతో పాటు ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు గణనీయంగా క్షీణించాయి. కేవలం మీడియా, మెటల్‌, ఫార్మా కౌంటర్లు మాత్రం ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. నిఫ్టి షేర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌తో పాటు వేదాంత లాభాలతో ముగిశాయి. ఇక నష్టపోయిన వాటిల్లో టాటా మోటార్స్‌ టాప్‌లో ఉంది. ఈ షేర్‌ 13 శాతం నష్టపోయింది. టైటాన్‌, హెచ్‌పీసీఎల్‌, ఐషర్‌ మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నాలుగు శాతంపైనే నష్టపోయాయి. రిలయన్స్‌ ఇవాళ 2శాతంపైగా క్షీణించగా.. గత కొన్ని రోజులుగా క్షీణిస్తూ వచ్చిన దీవాన్‌ హౌసింగ్‌ ఇవాళ పది శాతంపైగా లాభంతో క్లోజైంది.