తులాభారంలో అపశృతి, గాయపడ్డ ఎంపీ శశిథరూర్ 

తులాభారంలో అపశృతి, గాయపడ్డ ఎంపీ శశిథరూర్ 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, యునైటైడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఆలయంలో శశిథరూర్‌కు తులాభారం నిర్వహిస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. ఒక్కసారిగా త్రాసు తెగడంతో ఆయన కిందపడిపోయారు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం శశి థరూర్‌  పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 

కేరళ నూతన సంవత్సరాది విషు పండగను పురస్కరించుకుని తంపనూర్‌ ప్రాంతంలోని గాంధారి అమ్మన్‌ కోవిళ్‌ ఆలయాన్ని శశిథరూర్‌ సోమవారం సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో తులాభారం నిర్వహిస్తుండగా.. శశిథరూర్‌ కూర్చున్న త్రాసు ఒక్కసారిగా తెగి కిందపడింది. దీంతో ఆయన తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయని  స్థానిక నాయకుడు తాంపనూర్‌ రవి మీడియాకు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఆయన తలపై 10 కుట్లు పడ్డాయన్నాయనీ, అయితే  మెరుగైన చికిత్స కోసం శశి థరూర్‌ను తిరువనంతపురం మెడికల్‌ కాలేజీకి తరలించినట్టు  చెప్పారు. 

హిందూ పర్వదినాల్లో తమ బరువుకు సరితూగే ధన, వస్తు రూపేణా దేవుడికిచ్చే కానుకే తులాభారం. విషు డే ( కేరళ ఉగాది) సందర్భంగా శశి థరూర్‌ అరటిపళ్లతో తులాభారం ఇచ్చారు. కేరళ, తిరువనంతపురంలోని గాంధారి అమ్మాన్‌​ దేవాలయంలో ఈ తులాభార నిర్వహిస్తుండగా పట్టుదప్పి ఆయన కిందపడిపోయారు. తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటికే వరుసగా రెండు సార్లు గెలిచిన శశిథరూర్‌.. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు.