రాజకీయాల్లో మర్యాద అరుదు, దాన్ని ఆమె ఆచరించారు

రాజకీయాల్లో మర్యాద అరుదు, దాన్ని ఆమె ఆచరించారు

తులాభారంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ పరామర్శించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం కేరళ వెళ్లిన ఆమె.. మంగళవారం ఉదయం తిరువనంతపురం మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి వెళ్లి శశిథరూర్‌ను కలిశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ పై ఆయన ప్రశంసలు కురిపించారు. రాజకీయాల్లో మర్యాద అనేది చాలా అరుదుగా కన్పిస్తుందని, దానికి రక్షణ మంత్రి ఉదాహరణ అని కొనియాడారు. ట్విటర్ వేదికగా ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కేరళ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ.. నిర్మలా సీతారామన్‌ ఆస్పత్రికి వచ్చి నన్ను పరామర్శించడం ఆనందంగా ఉంది. భారత రాజకీయాల్లో మర్యాద అనేది అత్యంత అరుదుగా కన్పించే గుణం. నిర్మలా సీతారామన్ దాన్ని ఆచరించి చూపారు’ అని థరూర్‌ ట్వీట్ చేశారు.

సోమవారం థరూర్ కేరళ కొత్త సంవత్సరం విషు సందర్భంగా తిరువనంతపురంలోని ఓ ఆలయంలో తులాభారం సందర్భంగా జరిగిన ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. తులాభారం తెగిపడి ఇనుపకడ్డి థరూర్ మీద పడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు ఆయన తలకు 11 కుట్లు వేశారు.