ఏప్రిల్ 6న కాంగ్రెస్ లోకి శత్రుఘ్న సిన్హా?!

ఏప్రిల్ 6న కాంగ్రెస్ లోకి శత్రుఘ్న సిన్హా?!

బీహార్ లోని పట్నా సాహిబ్ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఏప్రిల్ 6న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ తర్వాత 'షాట్ గన్' నవరాత్రి శుభ ముహూర్తం అయినందువల్ల మంచి పనిని ప్రారంభించేందుకు ఏప్రిల్ 6ని ఎంచుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఆయన కాంగ్రెస్ లో చేరతారా? లేదా? అనే విషయంపై రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు చెలరేగుతూ వచ్చాయి. రాహుల్ ని కలిసి వచ్చిన శత్రుఘ్న తను పట్నా సాహిబ్ లోక్ సభ సీటు నుంచి పోటీ చేయనున్నట్టు మరోసారి స్పష్టం చేశారు.

పట్నా సాహిబ్ సీట్ విషయంపై చర్చించేందుకే బీహారీ బాబు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లినట్టు తెలిసింది. అయితే ఇప్పటి వరకు దీనిపై స్పష్టత రాలేదు. శత్రుఘ్న సిన్హా పట్నా సాహిబ్ సీటు నుంచి బరిలోకి దిగడంపై పట్టు వీడటం లేదు. కానీ కాంగ్రెస్ ఆయనకు మాట ఇవ్వడానికి వెనకాడుతోంది.

ఇదిలా ఉండగా శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు బీహార్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి శక్తి సింగ్ గోహిల్ చెప్పారు. సిన్హా మా స్టార్ నేత, స్టార్ క్యాంపెయినర్ గా పని చేస్తారని గోహిల్ ప్రకటించారు. అయితే శత్రుఘ్న సిన్హా పట్నా సాహిబ్ సీటు నుంచి పోటీ చేయడంపై మాత్రం ఆయన ఏం చెప్పలేదు.

శత్రుఘ్న సిన్హా బీహార్ లోని పట్నా సాహిబ్ సీటు నుంచి పోటీ చేయాలని పట్టుదలగా ఉన్నారని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో కొంత కాలం పాటు ఆయన పార్టీలో చేరడం అనుమానమేననే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. బీహార్ లో పొత్తులో సీట్ల పంపకాలపై ఇంకా నిర్ణయం జరగలేదు. అందువల్ల శత్రుఘ్న సిన్హాకు ఆయనకు ఇష్టమైన సీటు నుంచి పోటీ చేయడంపై కాంగ్రెస్ ఎలాంటి హామీ ఇచ్చే పరిస్థితి లేదు. పట్నా సాహిబ్ సీటు నుంచి బీజేపీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను బరిలోకి దింపింది.